Pages
▼
04/05/2017
ISIS The State of Terror - Jessika Stern & J.M.Berger
ఇది ఒక సారి చదవడానికీ, కరెంట్ అఫైర్స్ రిఫ్రెషర్ లాంటి పుస్తకమే. ఇది సాహిత్యం కాదు. కొందరి జీవితం. ఎప్పటికప్పుడు మారిపోయే వార్తల్లో ఒక భయంకరమైన కధనం. కాకపోతే ఈ కధ లో బోల్డన్ని మనకి తెలిసినవీ, తెలియనివీ థియరీలు ఉన్నాయి. ఈ కార్పొరేట్ తరహా, ఎక్సిక్యూటివ్ ఉగ్ర సంస్థ పుట్టు పూర్వోత్తరాల గురించి చాలానే పుస్తకాలొచ్చాయి. అన్నిట్నీ చదవలేకపోయినా, నేను తడిమిన రెండు మూడు పుస్తకాల్లో ఇది కాస్త ఆసక్తికరంగా అనిపించింది. కాలంతో పాటు ద్రవంలా పరిస్థితులు ఎప్పటికప్పుడూ మారిపోతున్నప్పుడు ఫాలో అప్ లా ఇలాంటి రికనర్లు ఉపయోగపడతాయి.
కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేకపోయినా ఒక రిఫ్రెషర్ లాంటి పుస్తకం ఇది. "ఇదే ఆఖరు. దీని తరవాత ఇంక ప్రపంచమే లేదు" అనిపించేంత దారుణమైన, బలంగా అల్లుకున్న, లొంగని మొండి కేన్సర్ లాంటి వ్యవస్థ ఐసిస్; అతి పెద్ద నెట్వర్క్ ఉన్న తీవ్రవాద సంస్థ. అమెరికానే ఐసిస్ ని సృష్టించిందీ, ప్రోత్సహిస్తోందీ అని రక రకాల వాదనలు ప్రచారంలో ఉన్నా, ఐసిస్ పుట్టుక, బ్రతుకు, చావు (!) గురించి ప్రపంచానికి, ముఖ్యంగా పాత్రికేయులకూ తెలిసిన సమాచారమే ఈ పుస్తకం.
గ్లాసరీ లో పేరులు, టైంలైన్ లో వార్తలూ, సమస్య ను సరిగ్గా అర్ధం చేసుకోవడానికి పనికొస్తాయి. రచయితలు ఇద్దరూ (అమెరికన్) జర్నలిస్టులు: జెసికా స్టెర్న్, జె ఎం బెర్గర్లు. ఇది ఒక చరిత్రను నమోదు చేసే ప్రక్రియ అని ఇద్దరి అభిప్రాయం కూడా. "If journalism is the first draft of history, a book such as this can only be the second draft, and certainly not the final word." ఏ రోజుకారోజు కొత్త కొత్త వార్తల్లో పాత వార్తలు మరుగున పడిపోయే ఈ కాలంలో పుస్తకంలో ముఖ్య భాగాల్నిండా.. 'ఈ పుస్తకం ప్రెస్ కి వెళ్ళినపుడు ఇలా జరిగింది' అని మరీ మరీ చెప్పుకున్నారు.
ఐసిస్ బహుశా ఎన్నడూ లేనంత విస్తృతంగా ప్రపంచమంతా విస్తరించిన సంస్థ. మామూలు ఉగ్రవాద మూక కాదు. దీనికి పెద్ద బలగం, వ్యూహం, లక్ష్యం వున్నాయి. ఏ దేశానికి చెందిన వారినైనా ఒక సారి తమ లో చేర్చుకున్నాకా, వీలైనంత వరకూ వారి చావు కబురు మాత్రం తప్పకుండా దగ్గరి వారికి చేరవేయగల సమగ్రమైన, ఒక ప్రభుత్వ సంస్థ లాగా ఆర్గనైస్డ్ పరిధి వారికి ఉంది. ఐసిస్ బాధితులు రెండు రకాలు. [ముస్లిం యువత] మతపరమైన ప్రలోభాలతో తమలోకి ఆకర్షించగా మిగిలిన, ఆ పిల్లల్ని కోల్పోయిన తల్లులూ. తండ్రులూ ఒక రకం ; ఐసిస్ చంపేసిన జనం, వారి బంధువులూ ఇంకో రకం.
పుస్తకంలోకి దూకే ముందు ఒక సారి గుర్తు చేసుకోవాల్సినవి :
2003 లో ఇరాక్ మీద అమెరికా యుద్ధం మొదలు, సద్దాం ప్రభుత్వం కూలడం, జర్కావీ (Terrorist leader behind AQI, ISIS) అనే భూతం పుట్టుకొచ్చి బాగ్దాద్ లో UN Headquartes మీద బాంబు దాడి చేయడం.
2004 లో అబూ గ్రాయిబ్ జైల్లో, బందీలు గా ఉన్న వారిపై US సాగించిన అకృత్యాల ఫోటోలు బహిర్గతం, వెల్లువెత్తిన ప్రజాగ్రహం, AQI (al Qaeda in Iraq) మొదలు. జర్కావీ, బిన్ లాడెన్ కు మద్దతు ప్రకటించడం
2005 లో పబ్లిక్ గా ఆల్కైదా ఇన్ ఇరాక్ (AQI), శిరస్చేధాలకు తెగబడటం. విదేశీ పోరాట వీరులకు ఆకర్షణీయంగా మారడం. ఈ లోపు Iraq లో బలవంతపు ప్రజాస్వామ్యం స్థాపన. అల్లకల్లోలం గా సున్నీ, షియాల ఆధిపత్య పోరు.
2006 లో అమెరికన్ బాంబు దాడిలొ జర్కావీ మరణం, ఐ.ఎస్.ఐ స్థాపన, అబు ఒమర్ అల్ బగ్దాదీ (బాగ్దాద్ కు చెందిన ఒమర్) దాని నాయకుడు గా ప్రకటింపబడడం. సద్దాం ఉరి.
2007 లో అమెరికన్ మిలిటరీ ఆధిపత్యం, సున్నీల ఉద్యమం మొదలు, దారుణంగా అణచపడిన ఐ.ఎస్.ఐ.
2008 లో Twist in the tale - ఇరాక్ ప్రైం మినిస్టర్ మాలీకీ 'షియా మిలీషియా' అణిచివేతకు ఆదేశాలివ్వడం,
2009 లో మాలీకీ ఆదేశాల మేరకు 'సున్నీ తీవ్రవాద సంస్థల' అణిచివేత. అంతర్గత కలహాల అనంతరం, సున్నీల లో ఐ.ఎస్.ఐ పట్ల పెరిగిన ఆదరణ. పట్టు తిరిగి సాధించుకుందుకు అవకాశం. ఐ.ఎస్.ఐ. బాంబు దాడుల్లో ఇరాకీ మంత్రులు సహా 100కు పైగా మరణం, అమెరికాకు చెందిన 'కాంప్ బక్కా' మూసేసాకా, దాన్నుండీ "అబు బకర్ అల్ బగ్దాదీ" విడుదల.
2010 లో అమెరికా దాడులో ఐ.ఎస్.ఐ. నాయకులు "అబు ఒమర్ అల్ బగ్దాదీ", "అబు అయూబ్ అల్ మస్రీ" ల మరణం తరవాత 'అబు బకర్ అల్ బగ్దాదీ' దానికి నాయకుడు కావడం.. ఇరాకీ ప్రభుత్వం లో మతపరమైన ఇబ్బందులు, కుట్రలు. అల్లకల్లోలంగా ఇరాక్ రాజకీయ చిత్రం. ప్రజల్లో ప్రభుత్వం మీద పెరిగిన అసంతృప్తి.
ఇది ఇరాక్ దాకా... ఇపుడు సిరియా:
2011 లో సిరియా లీ దారా పట్టణం లో పదిహేనేళ్ళ పిల్లలు ఒక డజన్ మందిని ప్రభుత్వ వ్యతిరేక గ్రాఫిటీ రాసినందుకు రెజీం అరెస్టు చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరశనలు. ఈ పిల్లల్లో "హంజా అల్ ఖాతిబ్" అనే పిల్లాడి చిత్రవధలతో చంపబడ్డ శరీరం ఇంటికి రావడం, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాల, అసాద్ ఉక్కు పాదం, ఇంకా ఇక్కడ పాకిస్తాన్ లో, ఒసామా బిన్ లాడెన్ మరణం,
2012 లో జవాహిరి (ఒసామా తరవాతి ఆల్ కైదా నాయకుడు) అసాద్ కు వ్యతిరేకంగా ముస్లింలు ఐక్యం కావాలని పిలుపు. ఐ.ఎస్.ఐ. మొదటి popular వీడియో The clanging of swords విడుదల. ఈ కాలంలోనే తన మీద పెద్ద అదుపు లేకపోవడం వల్ల జూలు విదిల్చిన ఐ.ఎస్.ఐ, జైళ్ళ నుండీ ఖైదీల్ని విడిపించడం అనే 'గోడలు బద్ధలు కొడదాం' అనే ఉద్యమాన్ని లేవదీసింది. ఇది, ఖైదీల్ని తమలో చేర్చుకుని, తమను "బలవంతంగా" చేసుకునే ప్రక్రియ.
2013 లో అమెరికా సిరియా కి "నిరాయుధ" మద్దతు ప్రకటించడం, 'జభాత్ అల్ నుస్రా' అనే తీవ్రవాద సంస్థ ప్రాబల్యం పెరగడం, తూర్పు సిరియా ఇస్లామిస్ట్ గ్రూపుల అదుపుకి రావడం. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మెర్జర్ లను ప్రకటించినట్టు ఐ.ఎస్.ఐ, 'జభాత్ అల్ నుస్రా', తమ సిరియన్ విభాగం అని ప్రకటించడం, వీళ్ళు కాస్తా దాన్ని ఖండించడం, అవీ. పూర్తి స్థాయి అంతర్యుద్ధం మొదలు. వివిధ జైళ్ళ నుండీ 500కు పైగా కరుడు కట్టిన ఆల్కైదా తీవ్రవాదుల విడుదలంచేసి తమలో కలిపేసుకున్న ఐ.ఎస్.ఐ. సిరియన్ రెబల్స్ ని కూడా సిరియా నుండీ తరిమేసి, ఆధిపత్యం నిలుపుకోవడం. ISI - ISIS (Islamic State in Iraq and Syria) గా మారి తన మొదటి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ని తెరవడం.
2014 లో అల్కైదా,ఇతర తీవ్రవాద సంస్థలతో పోట్లాటలు వచ్చినా, ముందుకే వెళ్ళి ఒక రోజు వేలాది ట్వీట్లు చెయ్యగల 'ఆప్' ని తీసుకు రావడం, డజన్ల కొద్దీ ఇరాకీ సైనికుల తలలు నరకడం లాంటి భయానక దృశ్యాలున్న The Clanging of Swords Part-4" వీడియో విడుదల, దేశ విదేశాల్లో యువత లో పెరిగిన క్రేజ్, ఇపుడే కాలిఫైట్ ప్రకటన, ISIS కాస్తా ఇస్లామిక్ స్టేట్ (Islamic State), 'అబు బకర్ అల్ బగ్దాదీ' - "కాలిఫ్ ఇబ్రహీం" గా మారడం, IS మొదటి ఇంగ్లీష్ మాగజీన్ 'దాబిక్' విడుదల.
ఈ సమయంలోనే విదేశీ బందీల గొంతు తెగ్గోసి చంపి, వాటి వీడియోల్ని విడుదల చేయడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి చెందింది ఐసిస్. . ఈ ఏడాదే ఎన్నో దేశాల్లో లోన్ వుల్ఫ్ ల (విఫల మరియు సఫల) దాడుల ద్వారా, తమ వేళ్ళు ఎంత లోతులకు పాతుకున్నాయో కూడా ప్రపంచానికి చాటి చెప్పింది ఐసిస్.
ఆగస్ట్ 19, 2014 న అమెరికన్ జర్నలిస్ట్ James Foley ఆ తరవాత ఇతర విదేశీయులు - బ్రిటిష్, రష్యన్, జాపనీస్, బల్గేరియన్, కొరియన్, ఫిలిపినో పౌరులు - ఇదే పద్ధతిలో చంపబడ్డారు. ఈ చావులన్నీ వీడియో కేమెరా ఎదురుగా. ప్రపంచానికి చాటిచెప్పడం కోసం. భయోత్పాతం కలిగించడం కోసం చిత్రీకరించబడ్డాయి. జిహాదీ జాన్ గా పేరు కాంచిన బ్రిటీష్ ఉగ్రవాది ఐసిస్ పరిధి ని ఇంకోసారి తెలియజేసాడు. ఈ తల నరికే వీడియీలు మొదట అల్ కైదా ఇన్ ఇరాక్ నాయకుడు 'అబు ముసాబ్ అల్ జర్కావీ' ఐడియా. వాటి ప్రభావం మీద అతనికి గొప్ప నమ్మకం. మొండి కత్తితో తీరిగ్గా గొంతు కోయడం, కౄరతకు, రాక్షసత్వానికీ పరాకాష్ఠ. రాత్రికి రాత్రే ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసే ప్రభావశీలత వీటికి ఉంది.
శత్రువు బలాన్ని అంచనా వేయడానికీ, దాన్లో విఫలమవడానికీ చాలా తేడాలుంటాయి. ఈ మధ్య యుగాల నాటి అరాచక కౄర అకృత్యాల వీడియోల DVDలు మొదట ఇరాక్ లో ఫిసికల్ గా పంచేవారు. ఇంటర్నెట్ యుగంలో ఈ ప్రచార కార్యక్రమం కొత్త పుంతలు తొక్కింది. ప్రచారం తో పాటూ ఈ ఉగ్ర మూక కు మిగిలిన అల్లాటప్పా ఉగ్ర మూకల కన్న ఎక్కువ ప్రాబల్యం చిక్కడానికీ, కొత్త వారిని ఆకర్షించడానికీ, తిరుగులేని ఒక సాంకేతిక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికీ సహాయం చేసింది.
ఈ సంస్థ కేవలం ఇరాక్ సిరియాల్లోనే కాకుండా ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం లోనూ, లోన్ వుల్ఫ్ ల ద్వారా విస్తృతంగా యూరోప్ లోనూ వ్రేళ్ళు తన్నుకుంటూ, బలంగా, వేగంగా, చాప కింద నీరులాగా విస్తరించడానికి ఈ సాంకేతిక ఆధిపత్యమే కారణం. వందలాది ప్రాచ్య పాశ్చాత్య దేశాలకు చెందిన కొత్త సభ్యులతో కొత్త ఉత్సాహంతో పుంజుకుంటూనే ఉంది.
2014-17 వరకూ, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా, బెల్జియం, ఇంగ్లండ్, బంగ్లాదేష్, ఇరాక్, పాకిస్తాన్ లలో పోలీసుల మీదా, సైనికుల మీదా, సామాన్య ప్రజల మీదా చేసిన వివిధ రక ఆయుధ దాడిలో దాదాపూ 1200 కు పైగా మరణించారు. ఇదో పెద్ద సంఖ్య కాదు. హిట్లర్ నాజీ జెర్మనీలో, వియత్నాం, కాంబోడియా, శ్రీలంకల్లో, గడాఫీ, సద్దాం, ఇడీ అమీన్ రాజ్యాల్లో, రెండు ప్రపంచ యుద్ధాల్లో, కరువు, కాటకాల్లో, సిరియా యుద్ధంలోనూ ఇంతకన్నా ఎక్కువ సంఖ్య లోనే ప్రజలు ఘోరాతి ఘోరంగా మరణించారు. మరి ఇదే ఎందుకు ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడించే సమస్య ? ఈ పుస్తకాన్ని చదవాల్సినిది మొదట రాజకీయ వర్గమే. దేనికైనా రాజకీయ పరిష్కారం సాధ్యమే.
ఈ సంస్థ మిగిల ఉగ్ర సంస్థల లాగా publicity shy కాదు. publicity hungry. ఆల్కైదా అగ్ర నాయకులకే విరక్తి కలిగించేంత లెవెల్లో మొండి కత్తులతో నెమ్మదిగా గొంతుకోసి హత్యలు చేయడం, ఒక గుంపు గా మనుషుల్ని హత్య చేస్తున్నప్పుడు, మిగిలిన బందీల్ని ఆ హత్యల్ని చూసేలా నిర్బంధించడం, స్త్రీల పట్లా, యజీదీల పట్లా చెప్పలేనంత ఘోరాలకు పాల్పడడం.. దొరికిన వాళ్ళను (ఇస్లాముని నమ్మని వాణ్ణి/వాళ్ళను) ఏ ఆయుధం చేతిలో ఉంటే దాంతో, ఆఖరికి చేతులతోనైనా, ఏదైనా వాహనంతోనైనా చంపమంటూ ప్రచారం చేసుకునే భయంకరమైన సంస్థ ఇది. ఆయా దాడుల్లో మరణించే ముస్లింలనూ, విశ్వాసులనూ collateral damage గా తీసిపారేసేస్తుంది.
దీన్ని ఎదుర్కోవడం కొండని తవ్వడం లాంటి పెద్ద పని. ప్రస్తుతానికి ఎక్కువ ప్రచారంలో ఉన్న వ్యూహం.. సైనిక పరమైన అలోచన. వారిని కార్నర్ చేసి, కుళ్ళగొట్టడం (let them Rot) .. ఆహారం, ఇతర సరఫరాలు అందకుండా చూడడం లాంటివి.. కానీ వివిధ భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అనాలోచిత వ్యూహాత్మక నిర్ణయాల మూలంగా, పరిష్కారం మాత్రం అందనంత దూరంలో ఉంది.
ఏది ఎలా ఉన్నా, ఈ పుస్తకాన్ని చదివాకా, రచయితలు ప్రస్తావించిన వివిధ సిద్ధాంతాలు, ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ హత్యా వ్యాపార లీలా వినోదాల వీడియోలకున్న క్రేజ్ , దీని ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వివిధ రకాలుగా జరుగుతున్న యుద్ధాలూ, ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఒకోసారి అసలంత కీలకంగానే అనిపించని ఈ సంస్థ వల్ల పొంచి ఉన్న ఆపదలు - విస్తృతంగా చర్చ లోకి వస్తాయి. వాళ్ళ పనితీరు, క్రమశిక్షణ, వృత్తి లో నైపుణ్యం, ముఖ్యంగా అబు బకర్ అల్ బగ్దాదీ పట్టూ. ఇవన్నీ చదివితే, సమస్య ని అర్ధం చేసుకోగలం. అందుకే కరెంట్ అఫైర్స్ ఇష్టపడేవాళ్ళు, (ప్రస్తుతానికి కంపేర్ చేసి చూస్తే పాతదే ఈ పుస్తకం) చదవొచ్చు.
This was first published in pustakam.net [ http://pustakam.net/?p=19624 ]
Nice Article
ReplyDeleteThq
DeleteThankyou
ReplyDelete