Pages

06/04/2017

కల

అది 1961 సెప్టెంబరు.  పూనా లో మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీ లో  మా కోర్స్ ముగిసిన తరవాత మా మొదటి పోస్టింగ్ సిక్కిం. ఆ రోజుల్లో అది ఇంకో రాజ్యం లా ఉండేది.  అప్పుడే అక్కడ చనిపోయిన ఇద్దరు ఇంజనీరింగ్ ఆఫీసర్ల స్థానాన్ని మేము భర్తీ చేస్తున్నాం అన్నమాట.   అక్కడ మా యూనిట్ కు చేరగానే నన్ను కధా స్థలానికి వెళ్ళమన్నారు.   కాకులు దూరని కారడవిలో హీమాలయ సానువుల్లో  ఇక్కడ ఒక రోడ్,  నది మీద ఓ వంతెన కట్టాలి మేము.  

ఆ మధ్య కాలం లోనే  తీస్థా నది లో వరదలు వచ్చాయి. ఉన్న వంతెన కాస్తా కొట్టుకుపోయింది.   సిక్కిం భూతల స్వర్గమే. కానీ మేము కట్టే రోడ్లూ, వంతెనలూ లేకపోతే ఇక్కడికినెవరైనా రాగలరా ?  ఈ మధ్య వంతెన కొట్టుకుపోయాకా, తాళ్ళతో ఒక వంతెన కట్టారు. అది కొన్నాళ్ళ వరకూ పనికొచ్చింది. ఒక సారి అదీ పుటుక్కుమంది- బరువెక్కువై.   దాంతో వంతెన మీదున్న ఆరుగురు కూలీలూ, ఇద్దరు కుర్ర ఆఫీసర్లూ, అయిదుగురు జవాన్లూ అదిగో ఆ తీస్థా లోనే పడి చనిపోయారు.    నేనూ అందుకే వచ్చాను. అంటే కొట్టుకుపోవడానికి కాదు లెండి. కట్టడానికి.

మేము ఇక్కడ సైనిక అవసరాల కోసం ఒక వంతెన కట్టాలి, ఈ సారి దీన్ని పఠిష్టంగా కట్టాలని ఆదేశాలొచ్చాయి.  కాసింత  దూరాన చైనా సరిహద్దు నుంచీ బైనాక్యులర్లు లేకుండానే వాళ్ళ విలాసవంతమైన రోడ్లూ, భవనాలూ (మన సరిహద్దు ప్రమాణాల్తో పోలిస్తే)   కనిపిస్తాయి.   మనం మాత్రం ఈ చరియలు జారిపడే మెత్తని కొండ లోయల్లో, తీగ వంతెనల్లోంచీ కొట్టుకుని వెళ్ళి ఏ బ్రహ్మపుత్ర లొనో శవాలై తేలుతాం.   తీస్థా నది సిక్కిం లో పుట్టి, బెంగాలు గుండా ప్రవహించి, బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్రా నది లో కలుస్తుంది. హిమాలయాల్లో పుట్టిన నది, ఆ వంకలన్నీ మలుపులన్నీ హుషారుగా దాటి, అడ్డూ అదుపు లేని సుడిగాలి లా ప్రవహిస్తుంది. మధ్యలో కొన్ని ఉపనదులు కూడా కలుస్తాయి. ఇంకేం ?

'టూంగ్' లో 'థేంగ్' అనే అత్యంత ప్రమాదకరమైన రాళ్ళతో నిండిన పర్వత సానువుల్లో వంతెన కట్టాలి. నేను, అక్కడికి 4 కిలో మీటర్ల దూరంలో కాస్త ఎత్తున 'థేంగ్ జిగ్స్'  లో విడిది చేశాను. ఎందుకంటే, ఇక్కడినించీ రోజూ ఒకసారి ఆ ప్రాంతాన్నంతా సింహావలోకనం చెయ్యొచ్చు. అంత ఎత్తునుంచీ ఏదైనా ప్రమాదకరంగా కనిపిస్తే నిర్ణయాలు తీస్కోవచ్చని నా ఆలోచన.   అయితే ఇక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు.మేము సామానంతా ఎలానో మోసుకుని ఇక్కడికి వచ్చాకా, ఇక్కడ వంతెన కట్టడం అసాధ్యమని తేలిపోయింది.  కిందకు ఓ వెయ్యి అడుగుల లోతున  ఉధృతమైన తీస్థా, నునుపు తేలిన బండ రాళ్ళతో నిస్పూచీ గా తెర్లుతూ ప్రవహిస్తుంది.  

 అక్కడ చైనాగ్ అనీ ఒక ప్రాంతం ఉంది. అది దాదాపూ నాలుగొందల అడుగుల రాతి ప్రాంతం.  వంతెన లేకుండా ఈ గుట్టని దాటాలంటే నాలుగొందల అడుగులు ఎక్కాలి, ఇంకో తొంభయి నిముషాలు  కిందికి దిగాలి.     యుద్ధ కాలాన ఇది చాలా ఎక్కువ సమయం. ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ లో వగైరా చైనా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చెయ్యడం కష్టసాధ్యం.  చీనీ సైనికులు, గుంపులా వచ్చి సరిహద్దు గురుతుల దగ్గర ఫోటోలు దిగి వెళ్తూంటే మన సైనికులు అరకొర వసతుల మధ్య, కొద్ది మార్బలం తోనే పెట్రోలింగ్ చెయ్యాలి. మన టెర్రైన్ అలాంటిది. వాళ్ళు ఫుట్ బాల్ ఆడుకుంటూంటే మనం చూస్తూ ఉండాలన్నమాట.  వారు అత్యంత ప్రామాణికత తో సరిహద్దు లో పహారా కాసే సైనికులకు పూర్తి సౌకర్యాలు కల్పించగలిగారు. సాంకేతికతా, సామర్ధ్యమూ తో పాటూ వారి వైపు ప్రాంతం మన వైపు లా దుర్భరం కాకుండా చూసుకోవడంలో చైనీయులు ముందు ఉన్నారు.  ఇప్పుడైతె, సరిహద్దులో మన మొబైల్ ల లో కూడా భారతీయ మొబైల్ సిగ్నల్ కాకుండా చైనా సిగ్నల్ వస్తూంటుంది.


ఈ మధ్య కొంత టెక్నాలజీ ని వాడుతున్నారు, కానీ అరవైల్లో ఆ అడవుల్లో, కొండల్లో ఏదైనా నిర్మాణం  ఎంత కష్టమో ఈ తరానికి తెలియదు.    ఈ వంతెన, రోడ్డూ తొందరగా కట్టాలి.  కాబట్టి, కొండకిరువైపుల నుంచీ పని మొదలుపెట్టాం. లంచ్ ముందు  ఒక వైపు, లంచ్ తరవాత ఇంకో వైపు. నిజానికి అక్కడ గుట్టని కాస్త పేల్చి 45 డిగ్రీ ల కోణంలో 20 అడుగుల వెడల్పుతో రోడ్ వెయ్యాలి అనుకున్నాం.   కానీ అక్కడి మట్టి చాలా వొదులు. పేలుడు తీవ్రత ఏమాత్రం ఎక్కువ అయినా.. మా టీం మొత్తం ఏటవాలు కొండ మీది నుంచీ తీస్థా లోకి జారిపడడం తథ్యం.


కానీ  200 అడుగుల రోడ్ కోసం కాసిన్ని పేలుళ్ళు  జరపాలి. దాని వల్ల చాలా చెత్త పోగయ్యేది. దాన్ని తీసి దారి శుభ్రం చేయడానికే చాలా సమయంపట్టేది.  పొద్దున్న పేలుడు జరిపితే, మధ్యాన్నం,  సాయంత్రం జరిప్తే పొద్దున్నా ఆ వ్యర్ధాలన్నిట్నీ శుభ్రం చేసేవాళ్ళం.  ఈ నది ఉత్తరాన్నించి దక్షిణానికి పారేది.   ఆ ఒరవడి,  జోరు, పరిసరాల్ని హోరెత్తించేది.  కానీ అక్కడి కొండల్లో మెత్తని మట్టి -  స్థిరత్వం లేని, పదును నిలవని మట్టీ, రాళ్ళూ, ఎప్పుడు జారిపడతాయో తెలీదు.  స్లైడింగ్ జరగడం, ఆ మట్టికుప్పల్లో బురదలో కూరుకుపోయి మరణించడం తాలూకు సంభావన చాలా ఎక్కువ. నా మిలిటరీ ఎకాడమీ కోర్స్ మేట్ ఇలానే మరణించాడు. కింద 1000 అడుగుల లోతున నదీ, 75 డిగ్రీల వాలులో నిర్మాణ వ్యర్ధాలూ.. వాటికి కొంచెం ఎగువన రోడ్డు కోసం మేము చేసుకుంటూన్న కాంక్రీటు  స్లాబులూ.. ఇదీ పరిస్థితి.

ఆ ఏటవాలు లోయలూ,  ఆరడుగుల వెడల్పున మేము వేసిన 100 అడుగుల  పొడుగు రోడ్డు,   స్లైడింగ్ హెచ్చరికలూ.. వీటన్నిటి వల్లా, నది మిగిల్చే అప్రశాంతమైన హోరు వల్లా నాకు రాత్రిళ్ళు కలత నిద్రే పట్టేది.  దానికి తోడూ.. మట్టిపెళ్ళల్లో నేను కూరుకుపోతున్నట్టూ, ఏదో కొండచిలువ నిలువెల్లా మింగేస్తున్నట్టు ఎముకలలో నొప్పీ, ఒక ఇరుకు పైపు లో నా శరీరాన్ని కుక్కేస్తున్న భావనా, ఊపిరీ, మాటా ఆగిపోయినట్టు.. కలలు వచ్చేవి. కలలు అనకూడదు. ఒకటే కల. తిప్పి తిప్పి అదే వచ్చేది. దీన్ని నాలో భయాలకూ, ఆందోళనకూ ప్రతిబింబమనే అనుకున్నాను చాలా నాళ్ళు.   మా డాక్టర్ కూ, టాస్క్ ఫోర్స్ కమాండర్ కూ కూడా ఈ కల గురించి చెప్పాను. వాళ్ళ సలహా మీద మా కమాండెంట్ కి కూడా.


ఆయన కూడా పడుతూ లేస్తూ సైట్ కి వచ్చి, కొండల్లో మా బ్లాస్ట్ లను పర్యవేక్షించారు. ఆ ఇన్స్పెక్షన్ కోసం మా టీం అంతా సిద్ధంగా ఉంది. ఎన్న్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని పర్యవేక్షణలు జరిపినా,  నాకు మా పనుల్లో తృప్తి కలిగేది కాదు. ఒక సారి కమాండెంట్  వెళ్ళగానే ఉపద్రవం  రానే వచ్చింది.  నా కళ్ళెదురుగా స్లైడింగ్ జరిగింది. క్షణాల్లో నేను మట్టి పెళ్ళల్లో, రాయీ రప్ప్పా తో కలిసి తీస్థా లోకి జారిపోసాగాను. సరిగ్గా కలలో లానే, నా శరీరం మట్టి దిబ్బల్లో కూరుకుపోయింది. ఉక్కిరి బిక్కిరి అయ్యాను.


ఆ బురద లో నదిలోకి కొట్టుకుపోయానంటే  ఇక బ్రతికేది లేదు. మామూలుగా తూలి పడబోతేనే నిగ్రహించుకోలేము కొన్ని సార్లు. అలాంటిది కొండ చరియల్తో పాటూ 1000 అడుగుల లోతుకి జారితే ఏది తట్టుకుని ఆగగలను ? నా పని అయిపోయిందనే అనుకున్నాను. దేవుడూ దెయ్యమూ ఏమీ గుర్తు రాలేదు. నా కలే గుర్తొచ్చింది. నా చావే నాకు ముందుగా కల లో కనిపిందేమో అని అనుకున్నాను. అసలు కొండ చరియ   మిన్నువిరిగినట్టు  విరిగి మేను మీద పడ్డాకా పుర్రెలో  ఇన్ని ఆలోచనలా అనిపించి, కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే, కాస్త తల ఎత్తి చూడగలుగుతున్నట్టు  అర్ధమైంది.

దైవవశాన నా  కాళ్ళ కింద ఒక స్లాబూ, నెత్తి మీద ఒక స్లాబూ ఉన్నట్టు అర్ధమైంది. అవే నన్ను  చావు నుండీ కాపాడాయి.  కింది స్లాబు నా జారుడును నిలువరించింది. అదే లేకపోతే ఆ మెత్తని మన్నులోకి కూరుకుపోయి సజీవ సమాధి అయ్యే వాడిని, నెత్తిన ఉన్న స్లాబు, చెట్లూ, రాళ్ళూ నెత్తిన పడి, పుర్రె పగలకుండా కాపాడింది.  దాదాపు  16 గంటల తరవాత  నన్ను ఆ  మట్టి లోంచీ లాగారు. నలుగురు కూలీలు చనిపోయారు. నాకు ఏమీ కాలేదు. అక్కడక్కడా చెక్కుకుపోవడం తప్ప.  నా చావుని ఏ శక్తి ఆపిందో తెలీదు. డాక్టరు దయ వల్ల ఫిట్ నెస్ పత్రం తెచ్చుకుని ఆ తీస్థా మీదనే ఇంకో నాలుగు నెలల్లో వంతెనా, రోడ్డూ నిర్మించాను.   ఒక సారి చచ్చి బ్రతికాక, చావు మరెప్పుడూ భయపెట్టలేదు.

అదృష్టం ప్రతీ సారీ దయ తలుస్తుందని లేదు. నా చావు ఆ రోజలా రాసిపెట్టి లేదు. అంతే. కానీ ఆ చావు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కాంక్రీటూ, ఉక్కూ ఆ ఎత్తున ఎలా చేర్చామో, కాంక్రీటు స్లాబుల్ని ఎలా తయార  చేసామో తెలీదు. రాత్రీ పగలూ అక్కడే ఉండి, చావూ బ్రతుకుల ఊగిసలాట లో బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేసాం.   సిక్కిం లో ఇలాంటివెన్నో చేసాం.   ఇంకా సరిహద్దు వెంబడి కొండల్లో సైన్యం తిరగగలగడానికి, సరిహద్దు కి చప్పున చేరడానికి వేసిన రోడ్ల,వంతెన ల నిర్మాణాల్లో ఎందరో ఆర్మీ జవాన్లూ, ఆఫీసర్లూ, మామూలు కూలీలూ చనిపోయారు.  వాళ్ళందరి ఆత్మలూ నన్న ఆ పూట బ్రతికించాయనుకుంటాను.  నేను ఆ రోజు మరణించి ఉంటే మరో ఇంజనీర్ వచ్చి నా పని పూర్తి చేసి ఉండేవాడు. కానీ జారుతూండే కొండ వాళ్ళ భయంతో ఆ నిర్మాణాన్ని పటిష్ఠం గా ముగించి ఉండేవాడా అనేది నేను చెప్పలేను.    ఆ కల ఇప్పటికీ స్పష్టంగా గుర్తొస్తూ ఉంటుంది.  అది ఒక కల మాత్రమే.. అనుకుంటూ ఊరుకుంటాను.

ఈ పని ముగించడానికే ఏ దివ్య శక్తో నన్ను రక్షించిందని అనుకుంటాను. ఇన్నాళ్ళకీ నేను కట్టిన .. అహ.. కాదు.. నన్ను ఉపయోగించుకుని ఏదో ఒక  దివ్య  భారతాత్మ కట్టించిన రోడ్డూ, వంతెనా, సిక్కిం లో కొత్త దార్లను తెరిచింది. సైన్యానికీ, స్థానికులకూ ఉపయోగకరంగా మిగిలింది.





PS :  {నిజమైన సంఘటనలకు కాస్త కల్పన జోడించి రాసినది}

No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.