Pages

20/11/2010

The Financial Expert

 ''ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్'' -  ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం చదివాను. ఆర్.కే. నారాయణ్ - నా అభిమాన రచయిత, మాల్గుడీ నేనెంతో ఇష్టపడే ఊరు. ఈ ఊర్లోనే ఈ ఫీనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉండేది. పేరు మార్గయ్య.

ఒక బాంకు బయట రిజిస్టర్ పట్టుకుని కూర్చుని, అప్పులిస్తూ, డబ్బు సంపాదన మీద తోచిన సలహాలూ అమ్ముతూ జీవితాన్ని ఎలానో నరుక్కొస్తుండే వాడు. కానీ అతనిలో ఒక 'ఇది' ఉంది. అది డబ్బు సంపాయించి పెద్ద వాడవ్వాలనే 'కసి'. కానీ దారిద్ర్యం అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆఖరికి కొన్నాళ్ళకి కర్మ వశాన, శని దృష్టి వక్రీకరించి, 'మా బేంకు ముందు కూర్చుని మా (అప్పులిచ్చే) బిజినెస్సుకి అడ్డం పడుతున్నావంటూ' బేంకీ వాళ్ళు దెబ్బలాటకొస్తారు. బెంకు దగ్గర చెట్టు కింద తన పేషీ కోల్పోయాక, ఆదాయం కోసం పడరాని పాట్లు పడతాడు. అతనికి డబ్బు విషయంలో తన ప్రావీణ్యాన్ని అమ్ముకోవడం తప్ప ఇంకో విద్య తెలియదు. అప్పు తీర్చవలసిన వాళ్ళు ఇంకా ఉండనే ఉన్నారు ! (డబ్బు సర్క్యులేషన్ లో వుంది) వడ్డీలు (చక్ర వడ్డీ) ఇంకా కొందరు కట్టనే లేదు. చేతిలో చిల్లి గవ్వ ఉండని పరిస్థితి. దానికి తోడు మార్గయ్య కొడుకు కేవలం పెంకితనానికి అతని రిజిస్టర్ని చింపి దాన్ని కాలువలో పడేస్తాడు. అందులో చిట్టా పద్దులన్నీ - మార్గయ్య అప్పిచ్చిన వాళ్ళ వివరాలు వగైరా ఒక్కసారి పోతాయి. అవన్నీ ట్రేస్ లేకుండా కొడుకు ఇలా భగ్న పరచడంతో అతని వెన్ను విరిగినట్టు అవుతుంది. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో, అతనికి ఏదో ఒక ఆదాయ మార్గం కావాలి. కొడుకుని నాలుగు వాయంచినా, వాడంటే ప్రాణం మార్గయ్యకి. భార్యా బిడ్డల్ని ఎలానో ఒక లా పోషించుకోవాలి. ఏ ప్రయత్నమూ ఫలించక.. భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకోవడం ఎలా అని భయపడిపోతాడు మార్గయ్య ! ఈ పరిస్థితులే అతన్ని దేవుడి వైపు మొగ్గేలా చేస్తాయి. ఇలాంటి ఖర్మ కాలి, జీవితం మీద ఆశ పూర్తిగా కోల్పోయిన రోజుల్లో ఎవరో చెప్పారని లక్ష్మీ పూజ చేస్తాడు మార్గయ్య. [డబ్బు అనే విజన్ ఉన్న వాడు కాబట్టి లక్ష్మీ దేవి కటాక్షం కోసం వెంపర్లాడతాడు]


ఈ పూజకి ఏమేమి వస్తువులు కావాలో అవి ఖచ్చితంగా - తూ, చా, తప్పకుండా, ఆవు పాలు, బురద కుంట లోని కమలం - ఘృతం - ఇంకేవో - అలా. ఇలా పూజ సామాగ్రి సేకరించడం అతనికి రివాజుగా మారుతుంది. అలానే ఒక రోజు అడవిలో ఏదో (పూజకే) తెచ్చుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఇంకోడు డాక్టరును  అంటూ ఒక 'పాల్' (డా. పాల్) కలుస్తాడు. అలా మాటా మంతీ కలిసి ఇద్దరూ స్నేహితులవుతారు. డబ్బు కోసం అతని మాట విని బొమ్మలతో సహా 'సెన్సువల్  (sex)' సాహిత్యాన్ని ముద్రించడం మొదలు పెడతాడు. అది బంపర్ హిట్ అయి, వెంటనే అతని సక్సెస్ గ్రాఫ్ పైకి ఎగబాకుతుంది. ధనార్జన పెరుగుతుంది. అతను ఇంతకు ముందు ఏ బాంకు ల ముందు డబ్బా పెట్టుకుని కూర్చునే వాడో ఆ బాంకు ల కన్నా ఎక్కువ డబ్బు చేరుతుంది.  స్వతహాగా మార్గయ్యది ఒక 'అహనా పెళ్ళంట లో కోట శ్రీనివాసరావు' లాంటి పిసినారి/greedy మనస్తత్వం. దానికి ఈ  డబ్బు  పైత్యం కూడా తోడవ్వడంతో సమాజంలో కొద్దో గొప్పో (బైటికి కనబడని) నిరసన కూడా ఎదురవుతుంది.


జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను అనుభవించిన మార్గయ్య మార్గయ్య చెట్టు కింద పద్దులు రాసుకునే సామాన్యుడిగా జీవితం ఆరంభించినపుడు అతని సర్వస్వమూ ఆ రిజిస్టరే !  ఇప్పుడు జీవితం కుదుటపడిందయ్యా అనుకునేసరికి, (డబ్బు కోసం గడ్డి కరిచినా - డబ్బున్న వాడు డబ్బున్న వాడే - వాడి జీవితం నిలదొక్కుకున్నట్టే!) కొడుకు (ఈ Sex literature,  డబ్బు కారణంగా) చెడిపోయాడని, చెడు అలవాట్ల పాలయ్యాడనీ తెలుస్తుంది. కొన్నాళ్ళకి కొడుకు ఇల్లొదిలి పారిపోతాడు. ఎంతో కష్టపడి, అతని గురించి వాకబు చేసి ఇంటికి తీసుకొచ్చిన మార్గయ్య - అప్పటికీ కొడుకు మీద ఏవో ఆశలు పెట్టుకుంటాడు.

మొత్తానికి జీవితం చివరి అంకానికి వచ్చేసరికీ, బిజినెస్సు లో మోసం ఎదురయ్యి కొంతా (partner డబ్బంతా చేజిక్కించేసుకుంటాడు) , పరిస్థితులు కలిసి రాక కొంతా - నష్టాలు పలకరిస్తూ, చివరికి జోలె ఖాళీ అవుతుంది. మార్గయ్య బ్రతుకు ఎక్కడి నుంచి బయలు దేరిందో అక్కడికే చేరుతుంది. ఇంక చెయ్యడానికి ఏమీ లేక, కొడుకుని పద్దులు రాయడానికి,  అలాంటిదే ఓ రిజిస్టరు ఇచ్చి చెట్టు కింద కూర్చోమంటే, చెడిపోయిన కొడుకు నిరాకరిస్తాడు.


ముసలి అయిపోయిన మార్గయ్య మళ్ళీ యధా ప్రకారం చెట్టు కింద బేంకు ముందర అదే బల్ల, అలాంటి రిజిస్టరే పట్టుకుని కూర్చుంటాడు. స్థూలంగా ఇదీ కధ. అయితే ఇందులో irony  మార్గయ్య జీవితాంతం డబ్బు వెనకే పరుగు పెట్టినా, జీవితంలో మిగతా అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టక, నిర్లక్షం చేసి, ఆఖరికి డబ్బు చేతే నిర్లక్షం చేయబడతాడు.  డబ్బు కన్నా మానవ సంబంధాలు మెరుగైనవి అని తెలుసుకునే సరికీ పుణ్యకాలం వెళ్ళిపోతుంది.   అదీ - ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కధ ! ఎలక పందాల్లో గెలిచినా నువ్వు ఎలకవే అని అందరూ ఒప్పుకున్నా - ఎలక పందాల్లో పాల్గొనక మానరు. అదో విష్ణుమాయ !

2 comments:

  1. నాకు ఆర్కే ప్రతి రచనా ఇష్టమేనండీ.. నాకు నచ్చిన ఇంగ్లీష్ పుస్తకాలు చెప్పమంటే ముందుగా చెప్పేవి ఆర్కేవే.. "ఇండియన్ ఇంగ్లీష్ మీద నీకున్న అభిమానం వల్ల" అంటారు మిత్రులు.. ఏది ఏమైనప్పటికీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ని మళ్ళీ కళ్ళముందు నిలిపారు...

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.