దీపావళి రోజులు. ఎక్కడ పడితే అక్కడే విచ్చలవిడిగా ప్రకటనలు. నా బుల్లెమ్మకి టీవీ పెట్టేసి ఏడ్స్ పెట్టేస్తే చాలు, నోరు స్పూను కు అనుగుణంగా, తొందరగా తెరుచుకుంటుంది. లేకపోతే, కొంచెం కష్టం.
పైగా దుకాణాల్లో భారతదేశపు నెంబర్ వన్ చాక్లెట్ కంపెనీ కాడ్బరీ ఇండియా లిమిటెడ్ - ఇస్ దివాలీ కో ఆప్ కిసే ఖుష్ కరేంగే ? అని ప్రశ్నా శరాలు సంధించేస్తూంది.
ఇప్పుడు దీపావళికి చాక్లెట్లూ, స్వీట్లూ ఇవ్వడం కన్నా ఎవర్ గ్రీన్ పుస్తకాలు ఇస్తే మంచిదనిపించి, మా 10 ఏళ్ళ బావగారబ్బాయికి, రాల్డ్ డహల్ రాసిన చార్లీ ఎండ్ ద చాక్లెట్ ఫేక్టరీ కొనిచ్చా. నాకే గనక ఎవరైనా ఆ పుస్తకం చిన్నప్పుడిచ్చుంటే, ఓలమ్మోర్నాయనో - వాళ్ళని తెగ గుర్తుపెట్టేసుకుందును. కానీ ఈ పుస్తకం పాతికేళ్ళు దాటాకా, చేపట్టి - అప్పట్నించీ రాల్డ్ కు వీర ఫేన్ అయిపోయాను.
మా అబ్బాయి కి ఈ పుస్తకం ఏమాత్రం నచ్చుతుందో నాకు ఐడియాలేదు. చార్లీ - బీదరికం, ఒకే బెడ్డ్ మీద ఒక వైపు అమ్మమ్మా, తాతారూ, ఇంకో వైపు నానమ్మా, తాతారూ సర్దుకుని పడుకుని, ఒకే రజాయి కప్పుకుని - ఒకే గదిలో చార్లీ అమ్మా, నాన్నల తో కలిసి సంతోషంగా వుండటాన్ని ఈ తరం 'అన్నీ ఉన్న ', కేవలం అమ్మా, నాన్నల తో మాత్రమే వుండే బాబు అర్ధం చేసుకుంటాడా అని అనుమానం.
నా చిన్నప్పుడు, రంగయ్యా, రంగమ్మా - రాత్రి పూట, మట్టి కుండలో వేడి అన్నం వండుకుంటూఉండే చందమామ శంకర్ ఇలస్ట్రేషన్ ఎంత స్వీట్ గా అనిపించేదో గుర్తొస్తుంది.
ఇప్పుడు, మనకున్న ఒక్కగానొక్క సంతానమూ, దీపావళి కోసం అయిదేసి వేల రూపాయలు పెట్టి పటాసులు కొనిపించుకుంటూన్నప్పుడు - వాళ్ళకి బీదరికంలో గ్లామర్ అర్ధం కాపోవడంలో వింత లేదు.
చార్లీ ఎండ్ ద చాక్లెట్ ఫాక్టరీ కధ సంగతి ఏమిటంటే, చార్లీ లాంటి కడు బీద కుర్రాడు - ఆ ఊర్లో విల్లీ వోంకా అనే ఒక పెద్దాయన నడిపే చాక్లెట్ ఫాక్టరీ లో ఒక కాంపిటీషన్ లో గెలిచి - ఆఖర్న ఆ ఫాక్టరీని గెలుచుకోవడం ! విల్లీ వోంకా - ఒక సారొక ప్రకటన ఇస్తాడు. తమ కంపెనీ చాక్లెట్లలో (ఇపుడు లక్స్ సబ్బులో బంగారం గెలుచుకోవడంలా) రేపర్ లో తన ఫాక్టరీ ని సందర్శించే అవకాశం కల్పించే ఇన్విటేషన్ ముద్రించినట్టు, ఆ చాక్లెట్ రేపర్లు (ఒక అయిదు) ఎవరు తెస్తే (ఆ పిల్లలకు) వారికి ఫేక్టరీ లో ఇంకో పోటీ పెడతాననీ - దాన్లో గెలిస్తే, యూ కెన్ విన్ ద ఫాక్టరీ ! అని !
అంతే, ఊర్లో తెగ సంత మొదలవుతుంది. పిల్లల్లో ఈ ఫాక్టరీ గురించి ఉత్సుకత, క్రేజ్ ! అయితే చిన్నప్పట్నించీ ఈ ఫేక్టరీ పరిసరాల్లో, పెరిగి, కోట లాంటి ఆ తలుపుల వెనుక ఉన్న ఫాక్టరీ, అక్కడ తయారయ్యే చాక్లెట్ గురించిన కలలు కంటూ వస్తున్న చార్లీ లో చిన్న ఆశ ! కానీ ఆ లక్కీ చాక్లెట్ తనకు దొరకాలంటే మాటలా ?
ఎంతో అత్భుతమయిన కధనం, చార్లీ మీద మనకు కలిగే ప్రేమా - చార్లీ కుటుంబ సభ్యుల చిన్న చిన్న త్యాగాలూ - విల్లీ వోంకా సహ్రుదయతా, మిగిలిన నాలుగు రేపర్లు సంపాయించిన నలుగురు పిల్లల పాత్రలూ - అన్నీ చార్లీ ఎండ్ ది చాక్లెట్ ఫేక్టరీ ప్రతిష్ఠ ని అజరామరం చేస్తాయి.
దీనికి సీక్వెల్ కూడా వుంది. ఇదే చార్లీ పరివారం, విల్లీ వోంకా తో కలిసి అంతరిక్ష యానం చేస్తారు. అది - చార్లీ ఆ ఫేక్టరీ గెల్చుకున్నాకా, యజమాని హోదాలో ఒక మేజిక్ ఎలివేటర్ - గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ లో చేసే మేజిక్ ప్రయాణం.
అభూత కల్పనలు - అమాయకత్వం, అబ్బురపరిచే విన్యాసాలూ - బాల సాహిత్యంలో రాల్డ్ డాహల్ చేసిన అత్భుత సృష్టి నాకు చాలా ఇష్టం.
ఇంతా చేసి - డహల్ కేవలం బాలల రచయిత కాదు. ఈయన కధలు చాలోటి తెలుగులో మనం ఎప్పుడో యండమూరి కలంలో చదివేసాం. వీటిల్లో ప్రముఖం అయినది - దుప్పట్లో మిన్నాగు అనే కధా సంకలనం. ఈ పుస్తకంలో అన్ని కధలూ, రాల్డ్ డహల్ కధల స్వేచ్చానువాదాలు ! ఏమో, ఆ విషయం యండమూరి ఒప్పుకోరనుకోండి.
మొత్తానికి ఈ దీపావళికి అందరికీ శుభాకాంక్షలు. టపాకాయల రూపంలో డబ్బులు తగలబెట్టుకుని ఆనందిస్తామనుకోండి. పర్యావరణం, టపాసుల తయారీ లో వెట్టికీ, దోపిడీ కి గురయ్యే బాల కార్మికులూ, అన్ ఆర్గనైస్డ్ సెక్టార్ లో ఉన్న మామూలు కార్మికులూ, ప్రమాదాలూ, ఇవన్నీ మీడియాలో చర్చకు రావాలి నాయంగా.
నా తరఫునుంచి మాత్రం, దీపావళి మర్నాడుదయం వీధుల్ని శుభ్రపరిచే మునిసిపల్ కార్మికులకు సలాం. మా బుల్లెమ్మ రెండో దీపావళి. బుల్లెమ్మ కి ఎప్పుడు చెప్తానో ఈ చార్లీ కధ ! .. హ్మ్మ్మ్ !
Chocolate Factory సినిమాగా వచ్చింది
ReplyDeleteI didn't read the book but watched the movie based on this book. I watched the recent one (Jhonny Depp acted in Wonka role). The movie was so colorful and lively with songs and animation work is very impressive. I liked this movie.
ReplyDelete:) btw, Nice write up.
ఈ నవల నేను చదవలేదు కానీ సినిమా చూశానండి, నాకు నచ్చింది.
ReplyDelete>>వాళ్ళకి బీదరికంలో గ్లామర్ అర్ధం కాపోవడంలో వింత లేదు.
ReplyDeleteఈ వాక్యం నాకు బాగా నచ్చింది.ఐదారు ఏళ్ళ వయసులో పుల్ల ఐస్ క్రీమ్ కొనుక్కొడానికి ఒక కానీ కోసం ఎంత పేచీ పెట్టాల్సి వచ్చేదో, మళ్ళీ గుర్తుకు వచ్చింది.కానీ ధనవంతుల పిల్లలు కూడా అల్లాగే పేచీ పెట్టేవారు. ఈ నాడు ఆ వయసు పిల్లలకి పోకెట్ మనీ. అది బహుశా పిల్లల పెంపకంలో మారిన తల్లి తండ్రుల మనస్థత్వమేమో అనిపిస్తోంది.
డహెల్ రాసిన కొన్ని కధలు చదివిన గుర్తు. ఈ నవల చదవలేదు.ఇప్పుడు దొరికితే చదవాలి.
పిల్లలకి పుస్తకాల కన్నా కార్టూన్ నెట్ వర్క్ లాంటి చానెల్స్ ఇష్టం గా ఉంది. పుస్తకాలు ఇచ్చినా ఉపయోగం ఉండదేమో అనిపిస్తోంది.
ఆలోచించాల్సిన విషయాలు బాగా చెప్పారు.థాంక్యూ
గడ్డిపూలు అనిచెప్పి చామంతిపూలు పెట్టారు :)
ReplyDeleteGood one , as usual.
ReplyDeleteచాకొలేట్ ఫాక్టరీ సినిమా చూసిన గుర్తు ఉంది. కానీ పుస్తకాలు విపరీతంగా చదివే నా కూతురు (మా అమ్మాయిని చూస్తే భలే గర్వం నాకు ఈ విషయంలో) కోసం ఈ పుస్తకం తప్పక కొంటాను.ఇవాళ కొంటే రేపటికల్లా నమిలి పడేసి తర్వాత జాగ్రత్తగా దాచుకుంటుంది. కావాలంటే నాకు అద్దెకిస్తుంది.
ReplyDeleteఇక ...చందమామలో అలాంటి ఇలస్ట్రేషన్స్ మాత్రమే కాదు, అవి చూసి చిన్నప్పుడు "మనం కూడా కుండలో వండుకుంటే? ఆ గుడ్డి దీపాల వెలుగులో" అనడిగి అమ్మచేత పిచ్చ చీవాట్లు తిన్న జ్ఞపకాలు కూడా స్వీట్ గానే ఉంటాయి.
మీరు చర్చకు రావాలన్న విషయాల మీద నాక్కుంచెం ఆసక్తి ఉంది.అందుకే దీపావళి రోజు ఉదయం రేడియోలో టాకుతున్నా ఈ విషయంపై!