నా మెదడు కు ఈ మధ్య ఇన్ పుట్ తక్కువయిపోయి ప్రోసెస్సింగ్ సమస్యలు తలెత్తాయి. నిన్న ఏప్రిల్ ఫస్టు న మా అనిత ఫోన్ చేస్తే, 'మన పండగ' (Fools Day) శుభాకాంక్షలు చెప్పి కూడా ఘోరంగా ఫూల్ అయిపోయా. చిన్నపుడు ఏ కాలం (era) లోనో ఫూల్ అయిన సందర్భాలున్నా, పెద్దయ్యాకా మోసపోవడం అయితే జరిగింది గానీ, ఏప్రిల్ ఫూల్ కావడం దాదాపుగా జరగలేదు. ఇంతకీ అనిత ఫోన్ చేసి, మా (ఇంకో ఫ్రెండ్) ప్రత్యూష టీవీ లో వస్తూందని చెప్పింది. ది హిందూ లో లాగా బ్రాకెట్టులో పదాలు ఉచ్చరింపబడలేదు గానీ అర్ధం అదే ! నేను నిజంగానే నమ్మీసి, టీవీ పెట్టుకుని, ఆ ఫలానా చానెల్ చూసా. మధ్యాన్నం అయే ముందు అన్ని తెలుగు చానెళ్ళలోనూ వంటా, వార్పూ వగైరా లేడీసు కార్యక్రమాలు కావడంతో ఆ 'అభిరుచి ' ప్రోగ్రాం చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఒకవేళ మా ప్రత్యూష నిఝంగా టీవీ లో వంట చేసేస్తుందేమో అని అమాయకంగా ఊహించేసుకున్నాను. కానీ న్యాయంగా, సహజంగా - లాజికల్గా - ఇంకెలాగా కూడా అలా (ప్రత్యూష టీవీ లో వచ్చిమరీ వంట చెయ్యడం) జరగకూడదు కాబట్టి నేను ఫూల్ అయ్యానని వెంటనే గ్రహించాలి.
అయినా - మెదడు లో రసాయన చర్యలు జరగక, లైట్లు ఆలశ్యంగా వెలిగాయి. ఆ 'అభిరుచి' లో నిఝంగానే ప్రత్యూష అనే అమ్మాయి ములక్కాడ ముక్కలు శనగపిండి లో ముంచి రెండంటే రెండే - అలా సున్నితంగా నూనెలో వేయిస్తూంది. అప్పటికీ మా అనిత ని మళ్ళీ పిలిచి నా (చానల్ వినడంలో) పొరపాటేమయినా ఉందేమో అని చెక్ చేసుకోబోయి ఇంకోసారి ఫూలున్నర అయ్యాను. ఈ కోతి వేషాలు మానేసి చాలా ఏళ్ళయిపోయింది. ఫూల్ అయితే అయ్యాను గానీ.. భలే గా అనిపించింది. నేనూ, మేమూ, మా గాంగూ - మేం చేసిన అల్లరి, మేం చూసిన సినిమాలూ, మా ఆశలూ, ఆవేశాలూ, కలలూ - జీవితం అంతా గుర్తొచ్చింది ! ఫూల్స్ డే కు ధన్యవాదాలు.
ఈ రోజు పేపర్లో చూసారా ? ఇంకోసారి జనాభా లెక్కలు మొదలయ్యాయి. నిర్మాణ్ భవన్ ఎదురుగా ఆరుబయట మోనిటర్ లో డిజిటల్ అంకెలు (జనాభా సంఖ్య) వేగంగా - (ఈ బిగ్ బాంగ్ ప్రయోగం లాగా వేగవంతం చేయబడ్డట్టు) గిర్రున తిరుగుతూండటం గుర్తొచ్చింది. 2000 వ సంవత్సరంలో దేశ జనాభా 'ఒక బిలియన్ ' మైలురాయి ని దాటినపుడు డిల్లీ లో హంగామా చేసారు. ఆస్థా అనే పాప డిల్లీ ఆస్పత్రిలో పుట్టింది. తను దేశం లో 1000000000000 వ సభ్యురాలిగా దేశం గుర్తుంచి ఏవేవో బెనిఫిట్స్ ప్రకటించింది. ఇపుడు జనాభా లెక్కలు ముగిసాకా - ముందుగా స్త్రీ, పురుష నిష్పత్తీ, దాని తరవాత దేశవ్యాప్తంగా పిలకాయలూ, వారి విద్యా, ఆరోగ్య పరిస్థితులమీద దృష్టి పెడతారు. అపుడు పురిట్లో చనిపోతున్న పిల్లలు ఇందరూ, బడికి పోని పిల్లలు ఇందరూ - సరయిన భోజనం లేక చనిపోతున్న పిల్లలు ఇంతా అని లెక్కలు చెప్తారు చూడండీ ! చాలా బాధ కలుగుతుంది. కర్మ వశాన జరిగేది ఎలానూ జరిగినా, ఇలాంటి సామాన్య సామాజిక పరిస్థితులు మన చేతులు దాటిపోవడానికి కారణం అలవికాని జనాభా విస్ఫోటనమే కదా ! ఇపుడు కపిల్ సిబాల్ విద్యా హక్కు అంటూ ఏవేవో ప్రకటనలు చేస్తున్నారు. సిద్ధాంతపరంగా మనం చాలా మంచి ప్రయత్నం లోనే ఉన్నాం. కానీ వాస్తవ పరిస్థితుల్లో, క్షేత్ర స్థాయిలో ఎన్నో అడ్డంకులు. అలా అని భయపడుతూ కూర్చోకుండా, కనీసం ప్రభుత్వం అనే వ్యవస్థ ఆలోచిస్తున్నందుకు అభినందించాలి.
మా అత్తయ్య ప్రభుత్వ పాఠశాల లో హెడ్ టీచరు గా పనిచేస్తుంది. తన సర్వీసులో ఎన్నో పల్లెలూ, పంచాయితీలలో ఎన్నో బడులు చూసింది. చిన్నపుడు అత్తయ్య చెప్పే స్కూలు కబుర్లు వినడానికి చాలా ఆసక్తి కరంగా ఉండేది. ఈ రోజుల్లో ఇపుడు వాళ్ళ బళ్ళో రోజుకు 800 మంది పిల్లకు భోజనం పెడతారు. విజయవంతమైన మధ్యాహ్న భోజన పధకం ఎందరో పిల్లల్ని బడికి తీస్కొస్తుంది. దాంతో పాటూ, సాధారణంగా నాగరికమైన శుభ్రం, శుచీ పాటించని ఆ పల్లె పిల్లకి - 'ఒరేయ్ పిల్లలూ, రేపట్నించీ మీరు తల దువ్వుకుని, స్నానాలు చేసి, ఉతికిన బట్టలు వేసుకుని రాకపోతే భోజనం పెట్టం చూడండి !' అని బెదిరించడానికి తనకి కష్తం గా అనిపించినా, పిల్లలకి బేసిక్ హైజీన్ నేర్పించడానికి ఈ సాంబారన్నం ఎంతో పని చేసిందని చెప్తుంది అత్తయ్య. నాకు నామిని సుబ్రమణి గుర్తొస్తాడపుడు. ఏమి చెయ్యడం ?
అబ్భ ! బోల్డంత 'గుర్తు రావడాల తో నింపేసానా ? మరంతా ఫూల్స్ డే మహిమ ! కధల్లో కధలు - ఆ ఫలానా మొదటి కధ చదివిన వారికే అర్ధమవుతాయి కదా ! అందుకే ఆలోచనలన్నీ ఎట్నుంచి ఎటో - అట్నుంచి ఇటు ఇలా తిరుగులాడాయి. బుల్లెమ్మ బజ్జుంది. ఇంతకన్నా మంచి సమయం దొరకదు అనిచెప్పి ఆలోచనలన్నీ తెరుచుకున్న కిటికీలలోకి తోసేసా. అదీ సంగతి.
హ హ మీ బుల్లెమ్మ బజ్జుని మీరు మాతో బోల్డు కబుర్లు పంచుకునే అవకాశాన్ని కల్పించిందనమాట :-) బాగున్నాయండీ. ప్రత్యేకించి స్కూల్ కబుర్లు, చిన్నారుల భవిష్యత్ పై ఆశలు చిగురింపచేస్తున్నాయి. పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ReplyDeleteబుల్లెమ్మా అమ్మా నువ్వు మేలుకుని చెప్పిన కబుర్లు బాగున్నాయి..
ReplyDeleteఅవును ఈ మధ్యన రోజు వారి జీవితం లో రక రకాలు గా ఫూల్ అవ్వటం అలవాటయ్యి ఏమో ప్రత్యేకం గా ఒక రోజేముందిలే అని నిట్టూర్చి వూరుకున్నా నిన్న. మొత్తానికి శుభాకాంక్షలు కూడా చెప్పారా? :-))
ReplyDeleteమీ బుల్లెమ్మ పొడూకుని మొత్తానికి మీ ఆలోచనలను అక్షరీకరించే ప్రాసెస్ ను లేపిందన్నమాట
>>నా మెదడు కు ఈ మధ్య ఇన్ పుట్ తక్కువయిపోయి ప్రోసెస్సింగ్ సమస్యలు తలెత్తాయి.
ReplyDeleteసుజాతగారూ!! నవ్వకుండా ఉండలేకపొయ్యానండీ
>>సాంబారన్నం ఎంతో పని చేసిందని చెప్తుంది అత్తయ్య.
హ్మ్!! ఏమాటకామాటండీ, పప్పుచారన్నంలో బీడీలు వచ్చినా, ఆ వేడివేడి అన్నం, పప్పుచారు పేద మధ్యతరగతి బతుకుల్లో చాలా రుచిగా అనిపించేది. నేను రెండు సమచ్చరాలు తిన్నా ఆ బువ్వ. నలుగురితోపాటు నారాయణ లాగా. కనీ పాలపిండితో చేసిన పాలు మాత్రం యాక్
ఆకాశవాణిలో ఓ పది నిముషాల పాటు ఓ కార్యక్రమం వచ్చేది.
ReplyDeleteతలపులపందిరి అని. ఎక్కడో కబుర్లు మొదలుపెట్టి ఎక్కడికో తలపులు వెళ్ళిపోతాయి అన్నమాట.
మన స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడేప్పుడు అలాగే కదా!
మీ టపా అలాగే ఎన్నో ఙ్ఞ్నాపకాల్ని తెచ్చింది.
మీ ఫ్రెండ్ కి థాంకులండీ.. మిమ్మల్ని ఫూల్ చేసినందుకు కాదు, ఇన్ని కబుర్లు మాతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు.. అన్నట్టు బుల్లెమ్మకి కూడా...
ReplyDeleteనిర్వహణ పరమైన సమస్యలు ఉన్నా మధ్యాహ్న భోజనం నిజంగా ఒక మంచి పథకం అండీ.. గ్రామ రాజకీయాలని దూరంగా అమలు చేస్తే బాగుండును..
బాగున్నాయండి మీ కబుర్లు...
ReplyDeleteబాగున్నాయండీ మీ కబుర్లు...
ReplyDelete-సౌమ్యవిబి.
బాగు బాగు
ReplyDeleteబాగా నవ్వుకున్నానండీ. కాస్తాలశ్యంగా ఫూల్స్ డే శుభాకాంక్షలు.
ReplyDelete