Pages

08/02/2009

టెలివిజన్ & స్త్రీలు

ఎన్నో రోజుల తరవాత టీ.వీ చూసేందుకు టైం చిక్కింది. పొద్దున్న మృణాల్ పాండే - 'బాతో బాతో మే' చూసాను. అప్పుడపుడూ చూస్తూండటం వల్ల ఎప్పటికపుడు ఈ కార్యక్రమాన్ని గురించి అర కొర సమాచారమే ఉంది. మొదటి సారి ఈ 'బాతో బాతో మే' Lok Sabha (DD)లో చూడటం ఆక్సిడెంటల్గా - చానెళ్ళు తిప్పుతూ నా ఫేవరెట్ (మాజీ) రాష్ట్రపతి కలాం తో మృణాల్ పాండే కాఫీ టేబుల్ చాట్ కనిపించగానే ఆగిపోయి కార్యక్రమాన్ని పూర్తి గా చూశాను. ఆ ఇంటర్వ్యూ మాత్రం కలాం వ్యక్తిత శోభను, మృణాల్ పాండే మృదువయిన కంఠం, లలితమయిన భాషా (ఈ ప్రోగ్రాం ఇంగ్లిష్ - హిందీలలో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తికి అనుకూలంగా వుంటుంది) కలాం ఆఫీసులో ఉన్నప్పుడు జరిగిన ప్రతీ విషయాన్నీ చక్కగా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకొచ్చి అంతం దాకా ఆకట్టుకుంది.


చిన్నప్పుడు టెలివిజన్ కొత్త గా వచ్చిన రోజుల్లో మృణాల్ పాండే వార్తలు హిందీ లో నూ, ఇంగ్లీషు లో కూడా చక చకా చదివేసేయడం గుర్తు. ఆవిడ హెయిర్ స్టయిల్ నాకు ఎంతో ఇష్టం ఇప్పటికీ ! ఇపుడు ఆవిడ 'హిందూస్తాన్' అనే హిందీ వార్తా పత్రికకు చీఫ్ ఎడిటర్.
మృణాల్ ఈ రోజు మీతా వసిష్ట్ (దిల్ సే లో టెర్రరిస్ట్ గా నటించారు) అనే ప్రముఖ నటి తో చక్కని సంభాషణ జరిపారు. సూటిగా చూసే కళ్ళతో ఆవలీలగా నటించే ఈ సహజ నటి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రోడక్ట్ ! నటన పరంగా రంగస్థలం, టెలివిజన్, సినిమా ఇలా అన్ని మాధ్యమాల్లో నూ నటించిన ఈవిడ ట్రాఫికింగ్ కి గురయ్యి, రక్షింపబడి, శరణాలయాల ఆశ్రయంలో ఉండే టీనేజి ఆడపిల్లల కోసం థియేటర్ వర్క్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. ట్రాఫికింగ్ (చిన్న వయసులోనే ఆడపిల్లలను (అమ్మి / కొనుక్కుని / ఎత్తుకొచ్చి) వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా ప్రవేశింపబెట్టడం) కు గురయ్యి అత్యాచారాలను ఎదుర్కొన్న పిల్లలు తీవ్రమయిన షాక్ లో ఉంటారు. వీళ్ళను చదువు వైపో, వృత్తి విద్య లోకో ప్రవేశింపజేసే ముందు వీళ్ళ వ్యక్తిత్వానికి కావలసిన మానసిక ఆలంబన తన కళ ఏమన్నా ఇవ్వగలగొచ్చునేమో అనే ఆలోచన తో ఆవిడ ఈ పనిని మొదలు పెట్టేరుట.

థియేటర్ వర్క్ షాప్ వల్ల ఆ పిల్లల్లో బెరుకు పోయి, ఆత్మ విశ్వాసం, భావ ప్రకటనా సామర్ధ్యం, ఇతరులతో కలిసి పనిచెయ్యగలగడం, నాయకత్వ లక్షణాలూ, భాష మీద పట్టూ - థియేటర్ అనగానే సమజంలో రకరకాల వ్యక్తులను, పరిస్థితులను అవగాహన చేసుకోవాలి కాబట్టి - జెనెరల్ నాలెడ్జూ పెరిగాయి. ఇంతకన్నా మంచి పని ఏముంది ? లోక్ సభ చానెళ్ళో ఈ కార్యక్రమం ఎపుడెపుడు ప్రసారం అవుతుందో నోట్ చేసుకోవడం మర్చిపోయాను. ఆదివారం మాత్రం 12 - 2 గంటల మధ్య మధ్యాన్నం ఒక్క సారి 'లోక్ సభ' చానెల్ని శృతించి చూడండి ! లేదా టైం టేబుల్ తెలుసుకొని పోస్టు చేస్తాను !


అలానే ఈ రోజు ఎన్ డీ టీ వీ ప్రాఫిట్ (NDTV Profit) లో మహిళలకు పనికొచ్చే ఆర్ధిక పరిజ్ఞానాన్ని గురించి చిన్న పరిచయం ఇచ్చారు !
ఇది చాలా విలువయిన సమచారమే. ఎందుకంటే మహిళలు ఇంటిని ఎంత చక్కగా నిర్వహించినా, ఉద్యోగాలు చేసినా డబ్బుల విషయంలో చాలా తక్కువ అవగాహన కలిగి ఉంటారు. ఇందుకు కారణం ప్రధానంగా 'నా భర్త / తండ్రి / సోదరుడూ' చూసుకుంటార్లే అనే ధీమా లేదా నిర్లక్షం లేదా ఆర్ధిక వ్యవహారాల్లో చొరవ చూపించడం వల్ల భర్త/కుటుంబ పెద్దా తమను తప్పుగా అనుకుంటారనే మొహమాటమూ కావొచ్చు.


వీటి వల్లనే కాబోలు మహిళలు మదుపు చేసే రకరకాల తెలివయిన ఉపాయాల గురించి తెలుసుకోవడానికి ఆశక్తే చూపించరు. కానీ ఆడవాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకొని తీరాలిట. సహజంగా ఆడవాళ్ళు - మగవాళ్ళ కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు. (స్టాటస్టిక్స్ ప్రకారం) రకరకాల మ్యూచువల్ ఫండ్స్ - రిస్క్ ఫేక్టర్స్ అన్నీ తెలుసుకోవడం, రిటైర్మెంట్ గురించి ముందుగా అలోచించడం, వివ్హాహం, గర్భధారణ, పిల్లల పెంపకం, తల్లిదండృల అనారోగ్యం లాంటి రకరకాల కారణాల వల్ల తరచూ కెరీర్ ను బ్రేక్ చెయ్యాలిసి వస్తుంది. అప్పుడు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తెలివిగా ఆ కెరీర్ బ్రేకుల్లో తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. అనుకోని పరిస్తితుల్లో ఒంటరులయితే జీవితాన్ని ఎదుర్కోవడమూ తెలుసుకోవాలిట :

ఇలా -

(1) (Working/Non-working) ఒంటరి మహిళలయితే :

(అ) ఒంటరి వారు కాబట్టి - ఆర్ధిక అత్యవసరాల్లో మిమ్మల్ని మీరే ఆదుకోవాలి. మీ ఆదాయంలోంచీ కనీసం 6 - 8 నెలల ఖర్చు ను ముందే దాచి పెట్టుకోండి. బాంకులో ఫిక్సెడ్ డిపాసిట్ అయితే మంచిది. అత్యవసర పరిస్థితి లో ఫిక్సెడ్ డిపాసిట్ ను బ్రేక్ చేస్తే 24 గంటల్లో మీ డబ్బు క్షమంగా మీకు చేరుతుంది.

బ్) జబ్బు పడటం, ఆక్సిటెంట్ కావడం లాంటి హాస్పిటల్ ఖర్చులు సంబాళించుకోవడం కోసం మెడికల్ ఇన్స్యూరెన్స్ చేయించుకోండి.

చ్) మీ మీద ఆధారపడే వాళ్ళెవరూ లేకపోతే లైఫ్ ఇన్స్యూరెన్స్ చేయించుకోకండి. యూలిప్ లు కూడా అనవసరం. దాని బదులు ఆ సొమ్మును ఇన్వెస్ట్ చెయ్యండి.

ఎ) మీకిష్టమయిన వారి పేర్న విల్ రాయండి.

(2) (Working Women) ఉద్యోగం చేసే గృహిణులు

కొందరు ఉద్యోగం చేసే మహిళలు కూడా అంతా భర్త మీదనే వొదిలేస్తారు. జీతం మొత్తం భర్త చేతిలో పోసి, తాము మాత్రం ఇల్లు చక్కబెడితే చాలు అనుకుంటారు. అనుకోనిదేమయినా జరిగితే విడాకులో, వైధవ్యమో ఎదుర్కోవాల్సి వచ్చినపుడు వీళ్ళకు చేతిలో ఎక్కువ సందర్భాల్లో కాణీ మిగలదు లేదా ఖర్చుల్ని ఎలా మేనేజ్ చ్జెయ్యాలో తెలియదు. వీళ్ళు పిల్లల్ని సాకడానికయినా కీడెంచి మేలెంచాలిట. డబ్బే భద్రత కదా. అందుకని వీళ్ళు -

(a) ఇంటి ఖర్చును ఎవరో ఒకరే కాకుండా భార్యా భర్తా ఇద్దరూ ముందే నిర్ణయించుకుని, షేర్ చేసుకోవాలి. ఒక జాయింటు అకౌంట్ మెయింటయిన్ చేస్తూ ఇంటి ఖర్చులకు ఇద్దరూ చెరి సగం డబ్బులు దాన్లో క్రెడిట్ చెయ్యొచ్చు.

b) ఆస్థులు / ఇళ్ళూ / పొలాలూ కొంటే అవి ఎవరి పేరు మీద ఉన్నాయో తెలిసి ఉండాలి. ఇద్దరి పేర్నా రిజిస్టర్ చేయించుకోవడం మంచిది.

c) భర్త / భార్య చేసే ఇన్వెస్టుమెంటుల్లో నామినీలు ఎవరూ అనేది ఇద్దరికీ తెలిసి ఉండాలి. భార్యా, పిల్లల పేర్న తీసుకొనే పాలసీల్లో స్పష్టత ఉండాలి.


d) ఆస్తి / ఇన్స్యూరెన్స్ / ఇన్వెస్ట్మెంట్ పేపర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. భర్త ఏదో పాలసీ తీసేస్కుంటాడు - భార్యకు తెలియనే తెలియదు. అనుకోకుండా భర్త చనిపోతే ఆయన పేర్న లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉందన్న సంగతే తెలియని భార్య అనవసరంగా ఆర్ధికంగా నష్టపోతుంది. ఇలా కేవలం పేపర్లు ఉన్నయ్యో లేవో తెలియకా, తెలిసినా ఎక్కడున్నాయో తెలియకా ఇన్స్యూరెన్సు కంపెనీలలో క్లెయిం కాని డబ్బు కోట్ల కొద్దీ మూలుగుతూ ఉంటుంది. అందుకే ఇది ఒక సింపుల్ మరియూ ప్రధానమయిన సూచన.

3) (Home-makers) గృహిణులు


ఏ) భర్తకు ఆదాయం ఎంత వస్తుంది - ఏ రకంగా వస్తుంది - (జీతం / వ్యాపారం / కమిషన్లూ వగైరా) మొదలయిన వివరాలు తెలిసుండాలి.

బి) భర్త కు ఉన్న లయబిలిటీస్ అంటే లోన్ల గురించి కూడా తెలిసి ఉండాలి. ఒంటరి అయినపుడు ఎవరో వచ్చి మీ ఆయన నాకింత సొమ్మివ్వాలి అంటూ అడిగితే ఆ విషయమేదో స్త్రీ కి తెలిసి ఉండటం అవసరం కదా ! మోసాలకు గురికావడం, ఒత్తిళ్ళకు లొంగడం, పిల్లల భవిష్యత్తు తో కాప్రమైస్ కావడం లాంటివి నివారించొచ్చు.

సి) భర్త కు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా లో ఎంత సొమ్మున్నదో కూడా తెలుసుకోవాలి. ప్రైవేటు ఉద్యోగం చేసే వారూ, రక రకాల ఉద్యోగాలు మారేవారూ తమ ఈ.పీ.ఎఫ్ ఖాతాను ఎప్పటికపుడు అప్డేట్ చేసి పెట్టుకోవాలి.

డీ) ఆస్థులు జాయింట్ గా కొనుక్కోవాలి. వీళ్ళు కూడా డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో తెలుసుకొని తీరాలి.

ఈ) నామినీలుగా / వారసులుగా - పిల్లలు ఉన్నారో లేదో చూసుకోవాలి.

ఎఫ్) ఇన్స్యూరెన్స్ పాలసీ లు తీసుకొనేటపుడు Married Womens' Property Act కింద (పాలసీ తీసుకొనే సమయంలోనే ఒక చిన్న ఫాం ని నింపడం ద్వారా) తీసుకోవాలి. దీని వల్ల పాలసీ సొమ్ము కేవలం పాలసీదారుని పిల్లలకు, భార్యకూ మాత్రమే చెందుతాయి. ఇతర కుటుంబ సభ్యులు (అన్నదమ్ములూ వగైరాలు) ఆ సొమ్ము కు ఎంతమాత్రం హక్కుదారులు కారు.

మొత్తానికి అందరు మహిళలూ రిటైర్మెంట్ కోసం ముందునుండీ డబ్బు ఆదా చేసుకోవాలి. ఇవన్నీ మంచి సూచనలే కదా.

4 comments:

  1. good info !!
    ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకీ కొన్ని భాద్యతల గురించి చెప్పారు...

    ReplyDelete
  2. మంచి సమాచారం.

    ReplyDelete
  3. మహిళలు ఆర్ధికంగా బలపడితే చాలా వరకు వాళ్ళ సమస్యలు తీరిపోతాయి.

    అన్ని వర్గాల మహిళలకి చెందిన సమాచారం అందించారు.

    ReplyDelete
  4. తెలుసుకోవాలని తెలిసున్నా నిర్లక్ష్యం చేస్తూంటాం. ఇలా గుర్తుచేయడం చాలా మంచి పని.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.