Pages

04/06/2008

మోపాసా కధలు

ప్రముఖ ఫ్రెంచ్ రచయిత గై డి మొపసాంట్ (మోపాసా) కధలు - ఈ పుస్తకం విశాఖ లో 'గుప్తా బ్రదర్స్' లో కొన్నాను. మళ్ళా దీని ప్రతి దొరకలేదు. అసలు అన్ని సాహిత్య ప్రక్రియల లోనూ.. నాకు 'కధలు' నచ్చుతాయి. మోపాసా రాసిన ఈ కధలను ఎవరు అనువదించారో, ఎవరు ప్రచురించారో... ఇపుడు చెప్పలేను. ఎందుకంటే, ఆ పుస్తకం ఎక్కడో చేతులు మారి నా దగ్గర నుంచీ పోయింది.


అనువాద రచనలు చదివితే.. ఆయా దేశాల, రాష్ట్రాల సమాజం, జీవితం గురించి స్థూలంగా ఒక ఐడియా వస్తుంది. ఫ్రెంచ్ సమాజం - ఫ్రెంచ్ వారి 'వ్యక్తి-స్వాతంత్ర్యం', వారి జీవన విధానం.. వగైరా తెలుసుకొనే అవకాసం లభిస్తుందీ కధలు చదివితే.


ఈ సంపుటి లో మొదటి కధ 'రోజ్' ది. రోజ్ ఒక వంటలక్క. టీనేజ్ లో ఉంటుంది. ఒక గ్రామంలో జమీందారు ఇంట్లో వంట చేస్తూ.. ఇంటి పనులు చేస్తూ జీవనం గడుపుతూ ఉంటుంది. ఆమె కు ఉన్న ఒక్కగానొక్క బంధువు ఆమె తల్లి. ఈ తల్లి ఆరోగ్యం బాలేక, స్వగ్రామంలో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటుంది. ఆవిడకు రోజ్ పంపే డబ్బులే ఆధారం. ఇలాంటి పరిస్థితులలో, యజమాని గొర్రెలు కాచే జాన్ అనే కుర్రాడు, రోజ్ ను ఆకర్షిస్తాడు. ఈ జాన్, రోజ్ ను చాలా నాళ్ళుగా వెంటపడుతూ, ఒంటరి గా ఉన్నపుడు మాటలు, చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంక ప్రేమ మొదలవుతుంది. ఇద్దరూ, పచ్చిక బయళ్ళ లోనూ, గొడ్ల సావిట్లోనూ.. రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళకు రోజ్ గర్భవతి అవుతుంది. అప్పటికే, ఆమె జాన్ ను తనను పెళ్లాడ మని అడుగుతూ ఉండటం, అతనూ ఒప్పుకుంటూనే, వాయిదాలు వెయ్యటం, జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడే జాన్ ఆమె మీద మోజు తీరాక, తప్పించుకు తిరగడం కూడా మొదలవుతుంది.


తన గర్భాన్ని గురించి తెలుసుకున్న తరవాత, రోజ్ జాన్ ను కలుసుకుని.. తనను పెళ్లి చేసుకొమ్మని ఖచ్చితంగా అడుగుతుంది. మరుసటి రోజు ఉదయమే జాన్ కనపడకుండా పోతాడు. రోజ్ ఊరంతా, అతని గురించి వాకబు చేస్తుంది. అతను అప్పటికే వేరే యజమాని దగ్గర పనికి కుదిరి, వేరే ప్రాంతానికి వెళిపోయి ఉంటాడు. అంటే, రోజ్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం అతనికి ఎంత మాత్రం లేదనీ, తనను కేవలం వాడుకుని, తన మానాన తను వెళిపోయాడని రోజ్ కు అర్ధం అవుతుంది.


అయితె రోజ్ కు ఇప్పుడు ఒక కొత్త సమస్య. తను ఇపుడు గర్భవతి. ఎన్నాళ్ళు తన పరిస్థితి ఇతరులకు తెలియకుండా దాస్తుంది ? ఎవరికన్నా తెలిస్తే, తను చులకన అయిపోదూ? ఇక ప్రతిమగాడూ తన కోసం ప్రయత్నిస్తే .. అని భయంతో, సిగ్గుతో, అవమానంతో, తనలోతానె కుంచుంచుకు పోతూ ఉంటుంది. అప్పటికే జాన్ సంగతీ, తన సంగతీ ఊరిలో అందరికీ చూచాయ గా తెలుసు. ఇక తను గర్భవతి నన్న విషయం తెలిస్తే ఎంత అవమానం?
అందుకే, తన గర్భం పెరిగే కొద్దీ.. శరీరం లో మార్పులు బయటకు తెలియకుండా.. పొట్టకు ఒక బట్ట తో గట్టిగా.. కట్టుకుంటూ ఏడు నెలలు కాలం ఎలానో నెట్టుకొస్తుంది. ఇలా ఉండగా.. ఒక రోజు ఆమెకు ఒక నల్ల సిరా తో రాసిన ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం చూడగానే, ఆమె కు అది జాన్ రాసాడేమో అని అనుమానం కలుగుతుంది. కానీ తనకు చదవటం రాదు. ఎవరి చేతనన్నా చదివించుకుంటే, తన రహస్యం బయటకు పొక్కుతుంది. అందుకే, వెంటనే ఆ ఉత్తరం జేబు లో పెట్టుకుంటుంది. రెండు రోజుల వరకూ, ఆ ఉత్తరం గురించిన తర్జన భర్జన ల తో మధన పడి చివరకు చర్చి లో మతాచార్యుడి చేత చదివించుకుంటుంది. ఇన్నాళ్ళూ ఆమె చర్చి మొహమే చూడటం లేదు. మతాచార్యుడికి ఏవో శక్తులు ఉంటాయని, తను ఆయనకు ఎదురు పడటం తోనే, తను చేసిన పాపం ఆయన గ్రహిస్తాదనీ ఆమె భయపడుతూ ఉండేది. కానీ.. ఈ రోజు తప్పలేదు.


చివరికి ఆ ఉత్తరం, తన తల్లి పొరిగింటి వారు రాసారని తెలుస్తుంది. తల్లికి చాలా అనారోగ్యం గా ఉంది. వెంటనే రమ్మని..ఆ సందేశం. వెంటనే, తీవ్ర ఆందోళనతో సెలవు అనుమతి కోసం, యజమానిని కలుస్తుంది. అప్పటికే ఆ జమీందారు, రోజ్ మీద కన్ను వేసి ఉంటాడు. ఎందుకంటే.. గర్భం లో పసి కందు పడిన దగ్గరినించీ ఆ పిల్ల కి, తన బిడ్డ కోసమే జీవించాలన్న ఆత్రం పెరుగుతుంది. తను బాగా పనిచేసి, యజమానిని మెప్పించి, జీతం లో పెరుగుదల తెచ్చుకుని, తల్లికీ, తన బిడ్డకు అండగా ఉండాలని రోజ్ ఆశ. అందుకే ఆమె ఇంటి పనులు చక్కబెట్టడం తో పాటూ.. అపుడపుడూ పొలానికి వెళుతూ, చక్కగా పని చేస్తూ ఉండేది. ఆమె అడుగు పెట్టాక, ఆ ఇంటికీ, పొలానికి లాభించింది. యజమాని డబ్బు తనదే అన్నట్టు గా జాగ్రత్త గా ఖర్చు పెట్టడం, ఆదా చెయ్యడం చేస్తూ ఉంటుంది. ఒక సారి రోజ్ చెప్పిన విధంగా గడువు కు ముందే కోతలు కోస్తారు. అలా చేసినందుకు అందరూ ఆమెనూ, యజమానినీ ఎగతాళి చేస్తారు. కానీ, ఆ రాత్రే, పెద్ద గాలి వాన వచ్చి, చుట్టూ పక్కల మోతుబరులు అంతా తీవ్రంగా నష్టపోతారు. జమీందారు వయసు నలభై ల లో ఉంటుంది. ఆ వయసుకి ఆయనకి పిల్ల దొరకడం కష్టం కూడా. ఆ రోజుల్లో, ఆడవాళ్లు - యజమాని భార్య అయినా.. పొలం లో కూలి పనికి వెళ్లి, ఇతర కూలీలతో సమానంగా పని చెయ్యటం సామాన్యం. అందుకే, ఇలాంటి పనిమంతురాలైన పిల్లను పెళ్లి చేసుకోవాలని యజమాని ఆశ పడతాడు.


సెలవు అడిగినపుడు.. రోజ్ తో 'సరే. నువ్వు ఊరు నుండీ వచ్చాకా, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి' అంటాడు. రోజ్ కూడా తన జీతం పెంచమని అడుగుదామని అనుకుంటూ ఉంటుంది. అందుకే తను కూడా.. తన యజమాని తో.. 'నేను కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను' అంటుంది. అప్పటికి ఆ సమావేశం ముగుస్తుంది.


ఊరు చేరేటప్పటికి రోజ్ తల్లి మరణిస్తుంది. ఈ బాధ లో కొట్టుకు పోతున్న రోజ్ కు ఏడు నెలల గర్భానికే, ప్రసవం జరుగుతుంది. నెలలు నిండకుండా పుట్టిన ఆ పసికందు ని మొదటి సారి చేతుల్లోకి తీసుకున్న రోజ్, ఆ వికృతమైన ఎముకల గూడు లాంటి బిడ్డ ని వెంటనే అసహ్యించుకుంటుంది. ఒక నెల తరువాత, అమెకు తిరుగు ప్రయాణం అయ్యే రోజు దగ్గర పడుతుంది. ఈ బిడ్డను తీసుకుని పనికి వెళ్ళలేదు కనుక.. కొన్నాళ్ళు బిడ్డను సాకేందుకు పొరుగు వారు ఒప్పుకుంటారు. ఆ బిడ్డ కోసం డబ్బు పంపిస్తానని వాగ్దానం చేసి, తిరుగు ప్రయాణం అవుతుంది రోజ్.
ఈ తిరుగు ప్రయాణం లో.. తన బిడ్డ ను తలుచుకుని, తనని వొదిలి రాలేక, బిడ్డ మీది మమకారం తో వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా దీనంగా, రెండు రోజులు - నడుస్తూనే ఉంటుంది. ఈ నడకకు కాళ్ళు బొబ్బలేక్కి, ఆ వేడికి దగ్గర్లో ఒక చెరువు కనపడితే, అందులో కాళ్ళు పెడుతుంది. చల్లగా అనిపించడంతో.. గబ గబా ముందుకు నడుస్తుంది. కాళ్ళ కి పెద్ద ముళ్లు గుచ్చుకుంటాయి. అసలే బాధ లో ఉన్న రోజ్ ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ, స్ప్రుహ తప్పిపోతుంది. సమయానికి ఆ దారినే పోతున్న రైతు ఒకడు ఆమెను రక్షించి యజమాని ఇంటికి తీసుకు వస్తాడు.


యజమాని ఇంటికి తిరిగి వచ్చాకా.. కొన్నాళ్ళకు ఆమె కోరుకున్నాక, యజమాని ఆమె ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తాడు. రోజ్ ఒప్పుకోను గాక ఒప్పుకోను అంటుంది. ఆమె మనసంతా...తన వికృతమైన బిడ్డ నిండి పోయి ఉంటాడు. ఒక కేతలిక్ గా..పెళ్లి అన్నది ఇపుడు పాపం. యజమాని మాత్రం మంకు పట్టు వదలడు. చాలా రోజులు వాద-ప్రతి వాదాల తరువాత.. ''ఇంకా జాన్ వస్తాడనే ఎదురు చూస్తున్నావా ? నీ సంగతీ నాకు తెలుసు లే ! ' అంటాడు. రోజ్ భయం తో బిగుసుకు పోయి, ఆయనకు ఎదురు మాట చెప్పదు. అతనికి ఏమి తెలుసు? అని సందిగ్ధం లో పడిపోతుంది. అయితె, ఆమె వ్యతిరేకత తో సంబంధం లేకుండా, ఒక రాత్రి ఆమెను బలవంతంగా లొంగదీసుకుంటాడు. అలా ఆమె తన యజమానిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.


పెళ్లైయిన తరవాత కూడా ఆమె మునుపటి లానే, పొలంలో కూలి లా పనులు చేస్తూనే ఉంటుంది. యజమానికి తన కొత్త భార్య వలన చాలా కలిసి వస్తుంది. అయన చాలా ధనవంతుడు అవుతాడు. అయితె, ఆ దంపతులకు ఇపుడు ఒకటే కష్టం. వాళ్ళకు పిల్లలు లేరు. అన్ని రకాల పద్ధతులూ పాటించారు.. దానాలు, ధర్మాలూ చేసారు. ఎవరేవరినో కలిశారు. పుణ్య క్షేత్రాలు దర్శించారు. తావీజులు కట్టించుకున్నారు. ఫలితం లేదు.


రోజ్ ఈ మధ్య కాలం లో అపుడపుడూ తన ఊరికి వెళ్తూ ఉంటుంది. ఆమె బిడ్డ, కొంచెం కండ పట్టి, చక్కగా కనిపిస్తున్నాడు. పిల్లాడి మీద వాత్సల్యం తో.. ఎంతొ ప్రేమ తో, ఎంతొ మమకారంతో ఊరు వెళ్ళటం, తిరిగి వస్తున్నపుడు తీవ్ర విచారం లో మునిగి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ పిల్లాడి సంగతీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది.


అయితె తన నిస్సంతు జీవితం భరించలేని జమీందారుకి విపరీతమైన కోపం వస్తూంది ఈ మధ్య. తన భార్య మీద చిందులు తొక్కుతున్నాడు. తనకు వారసుడిని ఈయలేక పోతున్నదని, తనని అవమానాలకు గురి చేస్తున్నదని.. ఆయనకు రోజ్ మీద వల్ల మాలిన కోపం వస్తుంటుంది. కొట్టడం, తన్నడం, గేలి చెయ్యడం లాంటివి ఎక్కువయ్యాయి. జమిందారుకి వయసు ఎక్కువ కావటం తో.. పిల్లలు లేకుండానే చనిపోతానేమో అని భయం ఎక్కువయింది. ఆమధ్య రోజ్ తో ఏదో వాదన ముదిరి, ఆమె ని రెక్క పుచ్చుకుని బయటకు లాగి, రాత్రంతా వర్షం లో వోదిలేస్తాడు. తెల్లారి, తలుపులు తెరిచాక, రోజ్ ఇంట్లోకి వస్తుంది.


ఆఖరికి ఒక రోజు ఆమెతో గొడవ పడి, రోజ్ తలని పట్టుకుని గోడ కేసి బాదుతాడు. అంతే ! అంతకాలం ఆయన దుర్మార్గాలన్నిటినీ సహించిన రోజ్ ఆ రోజు మాత్రం భరించలేక పోతుంది. 'నీకు పిల్లలు లేక పొతే లేరు.. నాకు మాత్రం ఒక కొడుకు ఉన్నాడు. మా ఊరిలో అనాధ అయి పెరుగుతున్నాడు. నాకూ, జాన్ కు కలిగిన బిడ్డ..!' అని పిచ్చిదాన్లా అరిచి ఏడుస్తుంది.


నిశ్చేష్టుడై.. రాయిలా నిలబడిపోతాడు జమీందారు. కానీ.. అదుపు లేకుండా ఏడుస్తున్న రోజ్ ని చూసి, ఆమె చెప్పిన నిజాన్ని అర్ధం చేసుకున్న తరువాత, ఆయన రోజ్ ను తన చేతి లోకి తీసుకుని.. 'పద! మన పిల్లాడిని తీసుకోద్దాం మన ఇంటికి..!!' అంటాడు. ఆ కుటుంబం ఆరోజు తో పరిపూర్ణం అయి.. అంతా హాయిగా ఉంటారు.


ఇలాంటి కదిలించే ఒక ౧౦ కధలు ఉన్నాయి ఈ సంపుటి లో. అన్నీ మానవ సంబంధాల గురించే.. ఎవరి దగ్గరన్న, ఈ పుస్తకం ఉంటే వాళ్లు అదృష్ట వంతులు!

5 comments:

  1. katha gurinchi chaalaa detailed gaa chepparu. It was interesting read. ee book dorike adrushtam naaku undo ledo.. kanee meeru raastune undandi. kaneesam parichayam ainaa avutundi.

    ReplyDelete
  2. మంచి సమీక్ష!
    అనువాదాలు ఎందుకు చదవాలనే విషయంలో మీరు ముందు చెప్పిన వాక్యాలతో నేనూ ఏకీభవిస్తాను.
    కొల్లూరి సోమ శంకర్ www.kollurisomasankar.wordpress.com
    www.kollurisomasankar.blogspot.com

    ReplyDelete
  3. కథ మీకు ఇంకా ఇంత బాగా గుర్తుందంటే, అది మీ మీద చూపిన ప్రభావం తెలుస్తోంది.నిజమే అనువాద కథలూ మిగతా సాహిత్యం చాలా విలువైంది. అనువాదాలు చెయ్యటం ఒక ప్రత్యేకమైన కళ కూడానూ.

    ‘చతుర’లో ఇలాంటి అనువాద కథలు వచ్చేవి.ఈ మధ్యెప్పుడూ ఈ ప్రత్రిక చదవలేదు. కానీ నా చిన్నప్పుడు మా ఇంటికి ’సోవియట్ భూమి’ అని రష్యా పత్రిక ఒకటి వచ్చేది (బహుశా కేవలం 10పైసలకి ఒక పత్రికనుకుంటా).దాని పుణ్యమా అని గోర్కీ,టాల్ స్టాయ్ వంటి రచయితలు నాకు పరిచయమైయ్యారు. ఇక మనవాళ్ళు ప్రేమతో తెనిగించిన బోలెడు బెంగాలీ సాహిత్యాన్ని గురించి తెలియని వారెవరూ?

    ReplyDelete
  4. కొల్లూరి సోమ శంకర్ - థాంక్స్. మీరూ అనువాద రచయితలే గా ?

    మహేష్ గారు - థాంక్స్! 'చతుర' కాదు. 'విపుల' లో కధలు వస్తాయి. ఇంకా.. మీరు సోవియట్ సాహిత్యం చదివి ఉంటే మా కికోసు మీకు తెలుసా ? ఇది చూడండి http://sangharshana.blogspot.com/2008_04_01_archive.html

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.