Pages

30/06/2008

సరదా కధలు - భరాగో

భరాగో గారి ఈ పుస్తకం, ఎన్నాళ్ళు గానో పరిచయం చేద్దామనుకుంటూనే, ఏదో ఒక పేజీ వెంట పడిపోయి, అలా... ఆ వెల్లువ లో కొట్టుకు పోతూనే ఉన్నాను. భరాగో అనగా.. భమిడిపాటి రామ గోపాలం గారు.. మా విశాఖ వాస్తవ్యులు. విశాఖ పోర్టు ట్రస్టు లో పని చేసి, రిటైర్ అయ్యి, మా ఇంటి దగ్గర ''ఇసుక తోట'' (విశాఖ లో ఒక కాలనీ పేరు) లో నే స్థిరపడ్డారు. ఆయన మా నాన్నగారికి 'ఆశీస్సులతో..' అంటూ ఆటోగ్రాఫ్ చేసిచ్చిన ఈ పుస్తకం 23-02-2002 తేదిన మా ఇంటికి వచ్చింది. ఈ పుస్తకం లో అచ్చంగా 'నూట పదహారు' సరదా కధలు - కధ కి ఒక రూపాయి చొప్పున, పుస్తకం వెల కూడా సరదాగా నూట పదహారే. అప్పటినించీ, ఇప్పటి దాకా.. ఎన్ని సార్లు ఈ కధలు చదివానో లెక్క లేదు. మర మరాలో, కాఫీనో - వర్షం పడిన మద్యాహ్నం సమయం లో అయినా.. మన బద్దకానికో తోడుగా ఈ పుస్తకం చదువుతూ ఉంటే, ఆ మజాయే వేరు.

ఈ పుస్తకం 1995 జూన్ లో తాన (తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా) పడవ మహా సభల్లో సంమానితులయిన ''బాపు-రమణ'' లకు వారి స్నేహ బంధ స్వర్ణోత్సవ సందర్భంగా అంకితం ఇవ్వదానికోసం జ్యేష్ట లిటరరీ ట్రస్టు ప్రచురించిన పుస్తకం. ఈ పుస్తక పరిచయం లో 'మధురాంతకం రాజారాం'' గారి పరిచయ వాక్యాలు కూడా ఉన్నాయి. నిత్య జీవితం మీద, ఫీచర్ గా రాసిన ఈ కధలు, ఆఫీసు జీవితం, టూర్ ల లో విశేషాలూకాలేజీ స్నేహాలూ, బాంధవ్యాలూ, చుట్టాలూ.. ఇలా అందరి మీదా... ఆప్యాయంగా వేసిన చెణుకులు.


సెక్సు కధలూ.. సరసాలూ గుప్పించి వ్యాపారం చేసుకునే వార పత్రికలూ, వీధి చివర గుళ్ళ లో మైకు సెట్టులూ, సరైన రూలు తెలియకుండా.. మన పనులకు మెలిక పెట్టె క్లార్కులూ, తెలుగు టీవీ వాళ్ల 'వ్యాఖ్యానం', ఈ మధ్య వస్తున్నా పాటలూ, శ్రమా ఖర్చులూ, వివాద భోజనంబు.. నమ్మక హరాం ... ఇలాంటి ప్రతీ విషయం.. (ఐస్ లోంచీ వాటర్ పద ప్రయోగం ఈ పుస్తకం లోనిదే..) ఆయా కధ ల లో చెక్కగా.. చెప్పేసి, బోల్డంత నవ్వు తెప్పించేస్తారు. అన్నీ సింపుల్ కధలే. కానీ.. ఆ కధలు చదివితే, ఒక పదేళ్ళ క్రితం జీవితానికీ.. ఇప్పటి నిత్య జీవితానికీ సామ్యాన్ని, తేడానూ - తెలుసుకోవచ్చు. అయితే, ఈ కధలు చెప్తే కన్నా.. చదివితే ఇంకా బాగుండడం ఒక విశేషం. ఆఫీసు రాజకీయాలూ... లోసుగులూ, కాపీ రాయల్లూ, రాజకీయ ఔత్సాహికులూ.. ఇలా కావేవీ కధ అల్లడానికి అనర్హం అన్నట్టు, కనబడ్డ అన్ని సమస్యల మీదా, సహేతుకమైన విమర్శ తో చెక్కగా ఇన్ని కధలు చెప్పేరు. ఇంక చదివి, సరదాగా నవ్వుకోవడం మనం చెయ్యగలిగే పని.

ఈ పుస్తకం చదివాకా.. మనసు లొ కలిగే ఫీలింగ్.. ఒక చమత్కారం తరవాత కలిగేది. బరువైన ఇతివృత్తం.. కధనాలూ ఉండవు. జీవితం మీద నిక్కచ్చి అభిప్రాయాలు, నిజాలూ పెద్ద ఆర్భాటం లేకుండా మనసు ని ఆకట్టుకుంటాయి. ఈ పుస్తకం నిజానికి ''కధన కుతూహలం'' పేరిట రచయిట వారానికి ఒకతి చొప్పున ఆంధ్ర జ్యొతి డెయిలీ కి రాసిన ఫీచర్ కధల లొ ఒక నూట పదహారు చిన్న కధలు - గుది గుచ్చి చేసిన మాలిక.

రచయితే, తన పుస్తకం గురించి స్వయంగా చెప్పుకుంటూ.. -- ''సరదా కధలు '' చాలా వాట్లొ ''నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొకపరి తలచే'' వినొదాత్మకత వుందని నా స్ఫురణ. సమాజం లొ తటస్థపడే క్రౌర్యాలూ, నైచ్యాలూ, చీకటి కొణాలూ, నా కధల్లో దృగ్గొచరం కావని ప్రసంసా, అభిసంసా కలిపిన కితాపు నాకిదివరకే దఖలు పడింది. అది మైనస్ పాయింట్ ఎలాగొ, ప్లస్ పాయింటూ అలాగే అని నన్ను నేను ఓదార్చుకుని, నా ఈ స్వ-పుస్తక-ప్రచురణా-వ్యసనాన్ని సమర్ధించుకుని, ఈ ''భారీ బడ్జెట్ వెంచర్ '' లొ దిగేసాను (పుస్తకం స్వయంగా ప్రచురించారు..) సరదాకి (ఏదో) ఆడితె, చాకలిది చీర పట్టుకుపొయిందని సామెత. ఈ సరదా కధల ప్రచురణ నాకొక వస్త్రాపహరణం కాకుండా వుండాలని, ఈ పుస్తకం, నేనూ బతికి బట్టకట్టాలనీ, నేనే తుమ్ముకుని, నేనే చిరంజీవ అనుకుంటున్నాను.'' అంటారు.

ఈ పుస్తకం తప్పకుండా చదవొచ్చు. నిరాశ చెందకుండా, కాసేపు నవ్వుకొవచ్చు.

పుస్తకం వెల : నూట పదహారు రూపాయలు - ప్రతులు విశాలాంధ్ర , నవోదయా బుక్ హౌస్ లలో దొరుకుతాయి.

3 comments:

  1. నేను కూడా రెండు మూడ్రోజుల క్రితమే ఈ పుస్తకం తెచ్చాను లైబ్రరీ నుండి. మీరన్నట్లు ఫీచర్ లా ఉంది ఈ కథల సంకలనం... ఒకట్రెండు కథలే చదివాను ఇప్పటికి. "సరదా" పరంగా బాగున్నాయి (అంతే!). పూర్తి అయ్యాక రాస్తాను మళ్ళీ. It was nice seeing somebody write about this book.

    ReplyDelete
  2. నాకు చాలా నిరాశా చిరాకూ కలిగించింది ఈ పుస్తకం.

    ReplyDelete
  3. నేను చదవాల్సిన పుస్తకాలలో మరోకటి చేర్చారు

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.