మహిళలు - వీళ్ళు ఒక పెద్ద శక్తి. మిగతా రాష్ట్రాల లో తెలియదు గానీ, మన రాష్ట్రం లో మాత్రం... ఒకప్పుడు సినిమాలు విడుదల అయినపుడు 'గొప్ప మహిళా చిత్రం' అని ప్రకటించుకునే వారు. ఇపుడు 'సకుటుంబ సపరివార .. చిత్రం' అని ప్రత్యేక సూచనలూ చేస్తుంటారు లెండి. ఈ మహిళా ప్రేక్షకుల కోసమే, 'భక్తి' సినిమాలూ (''అమ్మోరు'', 'దేవి' .. లాంటివి), సౌందర్య సినిమాలూ ('పవిత్ర బంధం', 'రాజా' లాంటివి), ఇంకా ఈ మధ్య 'ఆడ వాళ్ళకు మాత్రమే!', 'ఆదివారం ఆడవాళ్ళకు సెలవు' లాంటి పేర్లు పెట్టి మరీ తీసారు.
మహిళా ఓటర్ల నిర్ణయాత్మక ఓట్లు పోతాయని సాక్షాత్తూ మన ముఖ్య మంత్రి గారు వంట గాస్ సిలిండర్ల పై కేంద్రం విధించిన యాభై రూపాయల అదనపు భారం తానే భరించేస్తానన్నారు. వెంటనే.. ఈ సినిమా వాళ్ల 'గొప్ప మహిళా చిత్రం' కాప్షన్ గుర్తొచ్చింది. అయ్య బాబోయ్! వై ఎస్ గారు ఈ ఒక్క మాటతో అఖిలాంధ్ర మహిళామణుల వోట్లను గెలిచేసుకుందామని ఆశ పడుతున్నారు. అసలు మంత్రం ఈ మహిళా వోట్లే! అదేదో ఈ పది నెలలలో మహిళా రిజేర్వేషన్ బిల్లు కూడా పాస్ చేయించేస్తే.. సోనియా గారికి ఇంకోసారి దేశాన్ని ఏలే సువర్ణావకాసం వస్తుందో - పురుషులకు వ్యతిరేక అయిపోయి (సంఖ్యా పరంగా పురుషుల సంఖ్య ఎక్కువ కదా!) వోట్లు రాలవో.. అని ఆ బిల్లుని ఆట్టే పెడుతున్నారు.
మహిళలు - వీళ్ళకు బస్సుల్లో ప్రత్యేక సీట్లు ఎందుకు ఇవ్వాలి ? అని తగువులాడే పురుష పుంగవులు.. తమ ఆడవాళ్ళను రైల్వే రిజేర్వేషన్ ఆఫీసు లోనో, సినిమా హాలు ముందో, 'స్త్రీ' ల క్యూ లలో నిలబెట్టేందుకు వెనుకాడరు. రక రకాల టీవీ సంస్థలు ఏవో ఆ సీరియల్లూ గట్రా తీసి ఆ మాత్రం లాభాలన్నా గడిస్తున్నాయంటే మహిళలే కారణం. మామూలు బట్టల షాపులు చూస్తుండగానే, పెద్ద పెద్ద మాల్ లు అయిపోయి, అక్కడే బంగారం, వజ్రాలూ అమ్మేస్తున్నారంటే.. పాపం ఈ మహిళలే కారణం. కాబట్టి - ఈ ఆడవాళ్ళు పెద్ద ''మార్కెట్ మంత్ర'' అయిపోయారన్న మాట. వీళ్ళని ఆకర్షిస్తే చాలు. ఏ వ్యాపారం అయినా పర్లేదు - పంట పండినట్టే.
ఆ మధ్య 'మధ్య నిషేధం' అని చెప్పి కేవలం ఆ మాట మీద ఆడ వాళ్ల ఓట్లను కొల్లగొట్టుకున్నారు. అసలు ఆడ వాళ్ళకు రాజకీయ చైతన్యం కన్నా, సామాజిక, ఆర్ధిక చైతన్యం ఎక్కువ. ఎప్పుడన్నా చూడండి.. నోబుల్ గ్రహీత యూనిస్ ఖాన్ దగ్గర నుంచీ.. ఈ మన రాష్ట్ర డ్వాక్రా వాళ్ల దాకా అడగండి - మహిళలు పాపం ఎలానో తంటాలు పడి తీసుకున్న అప్పులు తీర్చేస్తారు. పెళ్లి అయి - ఇద్దరు పిల్లలు పుట్టాకా.. దురదృష్టాన భర్త చనిపోతే, పెద్ద చదువూ, తెలివితేటలూ లేకపోయినా... పిల్లల కోసం ఏటికి ఎదురీగి గెలిచిన సాధారణ మహిళలు ఉన్నారు. కానీ.. వీళ్ళకు రాజకీయాలు పెద్దగా తెలియదు. వీళ్ళలో చాలామంది - ఎవరు ఉల్లిపాయలు తక్కువ ధరకిస్తే.. వాళ్ళకు ఒటేస్తారు.
మహిళల గురించి ఎవరు ఏమన్నా అనుకోనీ.. ఈవేళ మాత్రం వీళ్ళు మొత్తానికి ఇంటి యజమాని జేబు లోంచీ తమ ప్రబల (అబలా) శక్తి , తో వంట గ్యాస్ కోసం - నెలకో ''అదనపు'' యాభై రూపాయలు జారిపోకుండా కాపాడారన్న మాట.
మహిళామణులూ జిందాబాద్
ReplyDeleteమహిళలను రాజకీయచైతన్య వంతులుగా చెయ్యకుండా,కేవలం రాజకీయ అవసరాలకు ఉపయోగించు కుంటున్న ప్రస్తుత వ్యవస్థకి ‘దండేలు’. ఇవన్నీ భరించికూడా,పరోక్షంగా కుటుంబానికి మంచి చేస్తున్న మహిళామణులకు దండాలు.
ReplyDeleteనా బ్లాగులో 7.2 లో చర్చ చాలా వేడిగా సాగుతోంది. ఒక లుక్కు వెయ్యండి
సరిగ్గా చెప్పారు.
ReplyDeleteబాగా చెప్పారు. 2004 లో నాయుడి ప్రభుత్వం కూలడానికి అనేక కారణాల్లో గ్రామీణ మహిళల (అప్పటి) కొత్త రాజకీయ ఆర్ధిక చైతన్యం కూడా ఒకటి అని నా గట్టి నమ్మకం. నాగరిక మధ్య తరగతి మహిళలు వోట్లకి ఎంత పనికొస్తారో నాకు ఐడియా లేదు.
ReplyDeleteభలే రాశారే! :)
ReplyDeleteరాబోయే ప్రభుత్వం ఇంటి యజమాని జేబు నుండి ఆ యాభైని వడ్డీతో సహా ఎలా రాబడుతుందో కూడా చూస్తూవుంటాం కదా. :))
మహిళలు నిజానికి ఒక సైలెంట్ మెజారిటీ అనుకుంటా. ఒక 20% మహిళలు కుటుంబ పెద్ద మాట మీద ఓటేసినా, చాలా మంది స్వసహాయతా సమూహాలు (SHGs) వచ్చిన తర్వాత వీటిలో తమకు తెలిసిన (అనిపించిన) రాజకీయ చర్చలు జరపడం ఖమ్మం జిల్లాలో ఉండగా నాకు తెలుసు. అంటే సామాజిక ఆర్థిక చైతన్యంతో పాటూ, మిగిలిన రాజకీయ చైతన్యానికి చాలా దూరం ఉండకపోవచ్చు.
ReplyDeleteరాధిక గారు - థాంక్స్.
ReplyDeleteఅన్నమయ్య, మహేష్, రానారె, కొత్త పాళీ గార్లు - థాంక్స్. మహేష్ - ఉంకో థాంక్స్. అయితె అదేదో ఊర్లో, మహిళలు ఒక ఎఫ్.ఎం. రేడియో నిర్వహిస్తున్నారట. (మన రాష్ట్రం లోనే..) ఆ విషయం ఎవరైనా చెప్తే బావున్ను. ఇంకేదో ఊర్లో (రాయలసీమ) మహిళలు బొరుగులు, సజ్జలు (బియ్యం కాకుండా..) లాంటి ఏవో ప్రాంతీయ ధాన్యాలు మళ్ళీ పండిస్తూ, వాటి వాడకం వల్ల ఆరోగ్యం బావుంటుందని ప్రచారం చేస్తున్నారట. ఇవన్నీ.. కూడా సక్సెస్ స్టోరీలే కదా.
సుజాత గారూ, మహిళలు నిర్వహిస్తోంది ఎఫ్.ఎమ్ రేడియో కాదు ‘కమ్మ్యూనిటీ రేడియో’. బస్తాపూర్ అని మెదక్ జిల్లాలో ఒక ఊర్లో ఈ సిత్రం జరుగుతోంది. ఇక్కడి మహిళలు వీడియో డాక్యుమెంటరీలు కూడా తీస్తారు. ఇవన్నీ ‘డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటి’ అనే స్వచ్చంధ సంస్థ సహకారం తో జరుగుతున్నాయి. ఈ మధ్యనే వీరికి భారత ప్రభుత్వం లైసెంసు కూడా మంజూరు చేసింది. మరిన్ని వివరాలకు ఈ http://www.ddsindia.com/www/default.asp చూడండి.
ReplyDeleteమహేష్ గారు - మీకు బోల్దేన్ని ధన్యవాదాలు. ఎఫ్.ఎం (Frequency Modulation) ప్రక్రియ లోనే ఈ కమ్యునిటీ రేడియో నడుస్తుందేమో అని నా అనుమానం. (విన్నట్టు గుర్తు) మీరు మంచి లింకు ని ఇచ్చారు. ఇంకో థాంక్స్.
ReplyDeleteసంఘం FM రేడీయో స్టేషన్ గురించి http://www.hinduonnet.com/fline/fl2501/stories/20080118506609400.htm
ReplyDelete-- శ్రీనివాస్
Sreenivas garu,
ReplyDeletethanks again. It is great.