Pages

16/03/2015

A little Poland in India





అపుడపుడూ దూరదర్శన్ అనే టెలివిజన్ చానల్ ను శృతించి చూడడం నాకో  ఓ వెర్రి అలవాటు.  బీ.బీ.సీ నాలుగు చానళ్ళూ, ఐ టీవీ, చానెల్ ఫోర్ లాంటి విదేశీ చానళ్ళ డాక్యుమెంటరీ ల తో సాటి రాదగ్గ మంచి డాక్యుమెంటరీ ని చూసే భాగ్యం కలిగిందీ సారి.  నాకు సాధారణం గా యుద్ధ గాధలు ఇష్టం. రెండు ప్రపంచ యుద్ధాల గాధలతో వెలువడిన చిత్రాలూ, నాజీ దురాగతాల చిత్రాలూ, అత్యంత హేయమైన యుద్ధ పరిణామాలని తెలిపే చిత్రాలూ ఇష్టం. అసలు ఎప్పుడో ఇంగ్లీషు చదవడం తో కుస్తీ పడే బాల్యంలో రీడర్స్ డైజెస్ట్ లో (తెచ్చిచ్చి చదవడం అనే మంచి అలవాటు ను కలిగించిన నాన్నగారికి ధన్యవాదాలు) చదివిన ఆన్నీ ఫ్రాంక్ డైరీ ఆఫ్ అ లిటిల్ గార్ల్.. దగ్గర్నించీ కూడా హాలో కాస్ట్ కి సంబంధించిన సినిమాలూ, కధలూ ఇష్టపడడం మొదలైంది.  దానికో కారణం ఉంది.


భయంకరమైన ఆడ్వెర్సిటీ మీద మనిషి చేసే ప్రతి ప్రయత్నమూ, బ్రతకడానికి, మనిషిలా మానవత్వంతో బ్రతకడానికీ చేసే ప్రతి పోరాటమూ అత్భుతమే. ఆ వ్యధాభరిత జీవితాల్లో వెలుగు రేఖల్లా పొడసూపే ఓ చెంచాడు కరుణా, చిటికెడు దైవత్వమూ చదివి తీరవలసిందే.    జెర్మన్ ఘెట్టోలలో చనిపోయిన లక్షలాది యూదులు, ముఖ్యంగా పోలండు ప్రజలు.  హిట్లర్ ఆక్రమణలలో నిర్దాక్షిణ్య మరణాలకు గురి అయిన తరాలు.  ఇన్ని హాలో కాస్ట్ కధల్లోనూ, మన దేశం లోనూ ఒక షిండ్లర్ ఉన్నాడని తెలియని వాళ్ళే ఎక్కువ. ఈ డాక్యుమెంటరీ చూసేదాకా నా పరిస్థితీ ఇంతే.  చూసాక మాత్రం, మన దిక్కుమాలిన దేశం, దిక్కుమాలిన రేపులూ, రాజకీయాలూ, అవినీతీ అని మొహం మాడ్చుకునే పరిస్థితి నుంచి కొంచెం ఊపిరి తీసుకోబుద్ధి ఐంది. 

ఓ మనసున్న మారాజు దాదాపు 1000 మంది పోలిష్ అనాధల్ని యుద్ధ సమయంలో అక్కున చేర్చుకున్నాడు. ఆయనే గుజరాత్ రాష్త్రానికి చెందిన నవా నగర్ రాజు జాం సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జీ రంజిత్ సింగ్ జీ జడేజా.   ఆయన కొన్నాళ్ళు బ్రిటీష్ ఆర్మీ లో కూడా పని చేశారు. పదవీ విరమణ చేసాక కూడా గౌరవ పదోన్నతులు పొంది లెఫ్టినంట్ జెనరల్ దాకా ఎదిగిన రాజు.   కారణం లేదా, అందుకు దారితీసిన సందర్భం ఏమో సరిగ్గా తెలియలేదు గానీ,  ఆ సమయంలో పోలండ్లోనూ, యూ.ఎస్.ఎస్.ఆర్ (నేటి రష్యా) లోనూ జైళ్ళకు తరలించబడ్డ వెయ్యి మంది పిల్లని పోలిష్ రెడ్ క్రాస్ ఈ రాజు గారి చెంత ఉంచడం జరిగింది. 1942-48 మధ్య కాలంలో ఓ వైపు తన రాజ్యం బ్రిటీష్ వారి ఆధీనంలో ఉండగా, బ్రిటీష్ సైన్యం యుద్ధం లో ఉండగా, భారత దేశంలో జోరుగా స్వతంత్ర పోరాట వీచికలు వీస్తూ ఉన్న సమయంలో తన స్వంత భద్రత కన్నా ఎక్కువగా ఆ అనాధ పిల్లల గురించే ఆలోచించిన జాం సాహెబ్ గురించే ఈ డాక్యుమెంటరీ.  అప్పట్లో ఆయన ఆశ్రయాన్ని పొందిన పిల్లలలో ఇపుడు మిగిలిన వయో వృద్ధులైన వాళ్ళ జ్ఞాపకాలు, పోలండు లో రాజా వారి పేర్న ఉన్న స్కూలూ, రోడ్డూ అన్నీ మనిషి కి లేని అవధులూ, కారుణ్యం కన్నా మించిన పెన్నిధీ ఏవీ లేవని తెలియ జెప్పేందుకు పోలండూ, ఇండియా సమ్యుక్తంగా తీసిన డాక్యుమెంటరీ ఇది. 


మనిషి కారుణ్యానికి లేని అవధుల్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఆకలితో, తల్లిదండ్రులూ, ఇతర సోదర సోదరీ మణుల ఆచూకీ తెలియని దుర్భర పరిస్థుతులతో, ఏ ఘ్ట్టో లోనో, గాస్ చాంబర్ లోనో కడ తేరగల బ్రతుకుల్ని, ఆదుకుని, సాకి, వాళ్ళలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ, పోలిష్ జెండా నీడలో, తమ అష్తిత్వాన్ని మర్చిపోకుండా పెంచి, కడకు, యుద్ధానంతరం, తమ తమ స్వస్థలాలకు లేదా కుటుంబాల దగ్గరికీ పంపించిన మహా రాజా అంటే వాళ్ళకి ఎంతో గౌరవం. అభిమానం. ఈ మహారాజు గురించి పోలండు లో ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి.
డాక్యుమెంటరీ నిర్మాణం గురిచి ఇండియా వచ్చి, నవనగర్ ప్యాలెస్ లో అడుగు పెట్టిన సర్వైవర్ ఆ పాలెస్ ఎంత పెద్దదో, అందులో తామెంత స్వేచ్చగా తిరిగే వాళ్ళమో, ఎంత తరచుగా తప్పిపోయే వాళ్ళమో చెప్తూంటే, భలే అనిపించింది.  


ఈ పిల్లల కోసం బాలా చడీ అనే కాంప్ ని నిర్మించారు జాం సాహెబ్. అక్కడ వీళ్ళు వేరే దేశంలో ఉన్నామనే భావన కలగనీయకుండా, పోలిష్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, పోలిష్ జెండా ఎగురవేయటం, పిల్లలకి తాము అనాధలం కామనే భావన కలిగించడం కోసం రాజా వారి ప్రసంగాలూ అదే దిశ లో ఉండేలా చూడటం వగైరాలన్నీ జరిగాయి. ఈ కాంపు మూసేసేటపుడు, చివరికి తమ తమ వార్ని కలిసేందుకు వెళిపోవాల్సిన పిల్లలు కూడా చాలా బాధపడ్డారంట. ఆ రోజుల్లో వాళ్ళకి ఆ ఆదరాభిమానాల్ని వొదలడం, ఈలోగా ఏర్పడిన స్నేహితుల్ని వొదులుకోవడం, కష్టమైందిట.  ఈ బాలా చడీ ఇప్పుడు సైనిక్ స్కూల్ గా రూపాంతరం చెందింది.


ఎక్కడి పోలండ్, ఎక్కడి గుజరాత్. ఎప్పటిదీ లింకు ? ఏమిటీ సంబంధం. వాళ్ళని మన మహారాజు ఆదరించడమేంటి. వాళ్ళు ఆ ఇండియన్ కనెక్షన్ ని ఎంత గాఢంగా అభిమానించడమేంటి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం... ఎవరికి ఎవరు ఋణపడి ఉన్నారో అనిపిస్తుంది. అయితే అప్పటి గాధని ఇంత చక్కగా మన ముందు పరిచిన డైరక్టర్ అను రాధ చాలా ప్రశంసనీయమైన పనితనాన్ని చూపెట్టారు. ఈ డాక్యుమెంటరీ ని మళ్ళీ ఎక్కడ చూడ్డమో నాకు తెలియదు గానీ, తీసిన వాళ్ళ అనుపానులు మాత్రం ఇవి.

http://aakaarfilms.com/


లింకులు :

http://newdelhi.mfa.gov.pl/en/news/good_maharaja_saves_polish_children___premiere_of_a_little_poland_in_india_in_new_delhi;jsessionid=A6A8EEBD502F3978A62F42449C9E01CC.cmsap2p


http://lafayette.org.uk/naw8562a.html



Edited : 18 Feb 18
http://www.thehindu.com/news/national/other-states/ex-maharajas-adopted-polish-children-to-attend-event-in-gujarat/article22785976.ece