నిజంగా - ఈ రోజు ప్రపంచ దోమల దినం. 113 సంవత్సరాల క్రితం సర్ రోనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ ఆర్మీ డాక్టర్, (on 20 Aug) మలేరియా దోమ కాటు వల్ల వస్తుందని కనుక్కున్నాడు. ఈ సంగతి తెలియక ముందు మలేరియా వ్యాధి బారిన పడి మిలియన్లాది మంది జనం యుద్ధాలలో, ఇతరత్రానూ మరణించేవారు. మొదట మలేరియా నిలవ ఉన్న నీళ్ళ ద్వారా వ్యాపిస్తుందని భావించే వారు. కానీ సర్ రోనాల్డ్ రాస్ మాత్రం ఇది ఒక రకానికి చెందిన దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తుందని నిర్ధారించేడు. ఆ సంబడానికి..ఇదే రోజున (ఇదే డాక్టరు) దోమల వల్ల వ్యాధులొస్తాయని కనుక్కున్నారని, ఈ రోజుని దోమల దినం గా జరుపుకుంటారంట !
అప్పటికి దోమల్లో, ఒకానొక రకం దోమని (ఏదయితే మలేరియాకు సంబంధించిన సూక్ష్మ జీవుల్ని తనలో మోస్తూ, కుట్టడం ద్వారా మనుషుల్లో వ్యాధికారక క్రిముల్ని మనిషిలో వొదుల్తుందో) కనిపెట్టి ఉండడం వల్ల రోనాల్డ్ రాస్ ఇంకో విచిత్ర ప్రయోగం కూడా చేసాడంట. మలేరియా రోగిని కుట్టిన దోమల్ని ఒక సీసాలో నీళ్ళతో సహా బంధించి, అవి చచ్చేదాకా ఎదురు చూసి, ఆ నీళ్ళను అతి కష్టం మీద లచ్మన్ అనే ఒక నౌఖరుకిచ్చి తాగమన్నాడంట. ఆ నౌఖరు కి 10 రోజుల దాకా ఎటువంటి జ్వర లక్షణాలూ కనిపించలేదు. ఆఖర్న కొంచెం జ్వరం, తలనొప్పి వచ్చినా, అవి ఫ్లూ కారణం గా వచ్చిందని పరిశోధన లో తేలింది.
20 ఆగస్ట్ 1897 లో మన పాత బేగంపేట్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో పరిశోధనా కేంద్రం లోనే ఆనోఫోలీన్ రకం దోమ టిష్యూ లో మలేరియా సూక్ష్మజీవుల్ని మొదటిసారి చూసాడు రోనాల్డ్ రాస్. ఈ డిస్కవరీకి గాను 1902 లో నోబుల్ బహుమతి గెలుచుకున్నాడు. ఈయన - నోబుల్ గెలిచిన రెండవ వ్యక్తి. నోబుల్ గెలుచుకున్న మొదటి & ఆఖరి ఆర్మీ ఆఫీసరు. నోబుల్ గెలుచున్నవారిలో అందరికన్నా వయసులో చిన్నవాడు.
మలేరియా బారిన పడి చాలా మంది ప్రజలు ఇప్పటికీ చనిపోతూనే వున్నారు. ఒక్క దోమకాటు గురించి - ఎక్ మచ్చర్, ఆద్మీ కో హిజ్డా బనా దేతా హై అని ఒక ప్రముఖ హిందీ సినిమా డైలాగు వినే వుంటారు. ఈ ఒక్క దోమకాటే, ఎందరో ప్రముఖుల ఉసురు తీసింది. [కింగ్ టట్ మమ్మీ మీ వూరొచ్చిందా? ఆయన మలేరియాతోనే ఔట్ అయిపోయాడుట. మలేరియా తోనే మన ముగాంబో అమ్రీష్ పురీ కూడా మరణించాడు] మలేరియా ఇప్పటికీ పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. క్వినైన్ లాంటి ఆంటీ మలేరియల్ మందులు చాలా వరకూ మృత్యువును నివారించగలిగినా, ఇప్పటికీ మలేరియాకు వైద్య పరిభాషలో ''కింగ్ ఆఫ్ ఆల్ డిసీసెస్'' అని బిరుదు ఉంది.
కాబట్టి రోనాల్డ్ రాస్ మన సికందరాబాద్ లో చేసిన ముందంజ ని 113 సంవత్సరాల తరవాత కూడా మనం గుర్తుచేసుకుంటున్నాము. పరిశుభ్ర వాతావరణం ఉన్నప్పటికీ, వాతావరణంలో వివిధ తేమ పరిస్థితుల వల్ల, దోమలు నగరాల్ని కూడా చుట్టుముడుతూనే వున్నాయి. ఏజెన్సీ లలో జన జీవనాన్ని అతిగా ప్రభావితం చేసేవి, రక్షితమంచినీరు లేకపోవడం వల్ల కలిగే కలరా, ఇంకా, దోమ కాటు వల్ల సంభవించే మలేరియా !
మలేరియా మరణాలు ఇప్పటికీ సంభవిస్తున్నాయి. ఎన్నో ఎన్.జీ.వో.లు దోమల మీద యుద్ధాన్ని ప్రకటించాయి. దోమల్ని చంపే వివిధ రకాల సాధనాలు మార్కెట్లో సౌకర్యవంతమైన పరిమాణాన్ని సంపాయించుకున్నాయి. మిలిండా గేట్స్ ఫౌండేషన్ మన దేశంలోనే దోమకాటును నివారించడానికి ఎన్నో దోమతెరలను పంపిణీ చేస్తోంది. ఇంతకీ రోనాల్డ్ రాస్, ఇండియన్ మెడికల్ సర్వీసు లేదా ఇప్పటి కాలం ప్రకారం భారత-బ్రిటీష్ సైనిక సాంప్రదాయాల ప్రకారం 'సైనిక వైద్యుడు' కాబట్టి ఇక్కడి ఆర్మీ మెడికల్ విభాగం, ఒస్మానియా యూనివర్సిటీ (Medical College), రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ లో ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. రోనాల్డ్ రాస్ కి ఒక అరడజను వీరతాళ్ళు !
అయితే ఈ రోజుకి ఏ రోనాల్డ్ రాస్ పేరో, మలేరియా పేరో పెట్టకుండా, మస్కిటో డే అని ఎవరు పేరు పెట్టేరో గానీ విచిత్రంగా ఉంది. ఇలా పేరు పెట్టడం వల్ల 'దోమల మీద అవగాహన పెరుగుతుందని అనుకున్నారేమో ! కరెంటు పోయినా, సాయంత్రం వీధి తలుపు తెరిచినా ఇంట్లో దూరి పిల్లా పీచూ తేడా లేకుండా కుట్టి సాధించే దోమలంటే ఎవరికి ఇష్టం ? అయినా సరే, దోమలు ప్రాణాంతకాలు కాబట్టే, దోమల్ని దూరంగా వుంచడం, అవి పెరగకుండా పరిసరాలు శుభ్రంగా వుంచుకోవడం, దోమ కాటుకు వీలయినంత మటుకూ గురికాకుండా వుండడం - వగైరా ప్రివెంటివ్ విధానాల పట్ల దృష్టి సారించాలి మన సమాజం అని, ఆ పేరు పెట్టుండొచ్చు.
ఇదీ సంగతి.