
అబ్బ ! ఈ నాటి ఇంటింటి రామాయణంలో బంధువులతో అంటీ ముట్టనట్టుండడం ఒక కళ. ఈ కళ అందరికీ వొంటబట్టదు. కొందరు ఎవాయిడ్ చేస్తే ఏ సమస్యా లేదు అనుకుంటారు (నా లాంటోళ్ళు) కానీ ఎవాయిడ్ చెయ్యడం కుదరదు. మాకో బంధువు ఒకావిడ ఉంది. మా అత్తారింట్లో ఆవిడది ఒక ప్రత్యేక స్థానం. ఆవిడంటే అందరికీ భయమూ, భక్తీ, హాస్యం (హేళన కాదు) వగైరాలు. నిజానికావిడ వయసులో మా అందరికన్నా చిన్నది. కానీ నోటి లో పెద్దది.
లొడ లొడ లొడ లొడా వాగుతూ, 'చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకువ' అన్న సామెత ను నిజం చేస్తూ, అందర్నీ ఉచిత సలహాలతో బోంబార్డ్ చేసేస్తూ - తల వేడెక్కించడం ఆవిడ హాబీ, బలహీనతా... సిగ్నేచర్ అన్నీనూ. వొంటలు బ్రహ్మాండం గా చేస్తుంది. నేను అసూయ చెందేందుకు చాలా సరకు ఉంది. అందం, చేతి లో మేజిక్, వగైరా. కానీ ఆ మాటల వేటే భరించడం కష్టం.
ఒకేసారి కోతి తలకీ తోకకీ నిప్పెట్టినట్టు - చికాకేయించేలా మాట్లాడడం వల్ల అందరికీ ఆప్తురాలు. నేను నోరు మూసుకుని కూచుంటానని మా అత్తగారి కంప్లైంట్. ఇంట్లో ఉన్నంతసేపూ వాగడం నా వల్ల కాదు. ఇందుమూలానా నేను బేడ్ కోడలినాయె. ఈ లెక్క ప్రకారం సదరు హీరోయిన్ - మా అత్తగారికి కడు ఆత్మీయురాలు. అందరి విషయాలూ ఈ బీ.బీ.సీ కి తెలుసు. వాళ్ళెవరో వాళ్ళ వేలు విడిచిన మేనత్త నాల్గో కోడలు ఇంట్లో సంగతులూ, వాళ్ళెదురింటావిడ వియ్యపురాలి నాలుగో మనవడు లండన్లో ఎవరో అమ్మాయి వెనక పడటం దగ్గర్నించీ, ఇంట్లో పనిమనిషి సీత మొగుడి సినిమా టికట్ల బిజినెస్సూ - అన్నీ కరతలామకం (సరైన పదమేనా?) అసలిలాంటి బీ.బీ.సీ. లూ, ఆల్ ఇండియా రేడియోలూ, సీ.ఎన్.ఎన్ లూ ఇంటికోకరు ఉంటారనుకుంటాను. వీళ్ళకి అందరి వార్తలూ మిగిల్న అందరికీ రిలే చెయ్యక పోతే తోచదు. పనిలో పని గా వార్తలకు మసాలా దట్టిస్తుంటారు. లేని వార్తలు సృష్టిస్తుంటారు. ఇదో జబ్బు ! వీళ్ళు కోలుకుంటారనుకోవడం కల్ల.
ఇంతకీ నా కడుపుమంటేంటంటే, లేటెస్టుగా ఈమె నాకూ, మా కావల్సిన వాళ్ళకీ మధ్య పెట్రోలు పోసి మంట పెట్టింది - కానీ విజ్ఞులం కాబట్టి, పెట్రోలు రేటు దృష్టి లో పెట్టుకుని ఇప్పుడిప్పుడే మంటల్ని ఆర్పుకుంటున్నం. కానీ ఈ వీకెండు సెలవల్లో నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడింటికే వెళ్ళాల్సి రావడం గుండెల్లో రాయి పడేలా చేసింది.
ఈ గండం గట్టెంకించమని అమ్మవారికీ అయ్యవారికీ దండాలు పెట్టుకుంటున్నా ! ఈ వెర్బల్ డయేరియాని 'పోనీలే ! తన మనసు మంచిది!!' అని ఇన్నాళ్ళూ భరిస్తూ వచ్చినా, కొన్ని కారణాల వల్ల ఆవిడ కావాలనే ఇక్కడి విషయాలు అక్కడా, అక్కడ సంగతులు ఇక్కడా చేరవేయడం మాత్రమే కాక, ''తగూలూ తంటాలూ'' సృష్టించి వినోదిస్తూందని, తర్కించి, తెలుసుకుని, ఆవిడకి ఎలా సమాధానం ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా.
కానీ లైఫ్ డైలీ సీరియల్ కాదు. ఒకరన్న మాటకి చెంప చెళ్ళు మనిపించేలా సమాధానం ఇవ్వడం నాకు చేత కాదు. కనీసం 'నొప్పింపక తానొవ్వక ' తరహా లో కూడా ప్రవర్తించకపోతే కష్టం. ఎప్పుడూ నేనే నొచ్చుకోవడం అనే విష్యాన్ని కొన్ని రోజులు ఆపాలి. ఆవిడకి ఈ సారి గుణపాఠం చెప్పాలి. కానీ ఆవిడకి (వాళ్ళింటికి నేనెళ్ళి ఎలా బుద్ధి చెప్పడం ?!)స్థానబలం వుంటుంది కనక & తోలు మందం కనకా - చాలా కష్టం. ఫ్రెండ్ అయితే, అసూయా, ద్వేషం, కోపం లాంటివి పుట్టవు. బంధువు కావడం తోటే తంటాలన్నీ. ఇబ్బంది పెట్టే ఈ బంధుకోతులందరూ డౌన్ డౌన్. 'అంటీ ముట్టకుండా' కన్నా, 'అంటుతూ, అంటిస్తూ' ఉండడం నేర్చుకోవాలేమో నేను.
11 వ్యాఖ్యలు:
మాటాడటం విషయంలో నేనూ డిటో అండి. ఆ ప్రకారం నేనూ బేడ్ కోడలినే. నా పనేదో చూసుకుని పుస్తకాలో,కంప్యూటరో పట్టుక్కూర్చుంటాను నేను ఖాళీ ఉంటే. ఎక్కువ మాట్టాడి మాటతేడాలు తెచ్చుకునే కన్నా మౌనమే నయం అనుకుంటాను నేను.
ఇక 'బీబీసీలు' మీరన్నట్లు ప్రతీ కుటుంబంలోనూ ఒకరిద్దరు ఉంటూంటారు. కానీ రాకపోకలు ఎవాయిడ్ చెయ్యటం 'కూతుళ్ళ'మైనప్పుడు చెల్లుతుంది కానీ 'కోడళ్ళ'మయ్యాకా కష్టమే మరి..!
ఇక పడటం అంటారా...పడ్డవాళ్ళేప్పుడూ చెడ్డవాళ్ళు కాదనేసుకుని మర్చిపోవటమే వంటికీ ఇంటికీ మంచిదన్నది అనుభవసారం...:)
కూతురుగా ఎన్ని ప్రివెలేజెస్ అనుభవించామో - (మీ కవిత గుర్తొస్తుంది) కదా! అనిపిస్తుంది. నేను రాత్రిళ్ళు (నిద్రపట్టక/ పొరపాట్న) పుస్తకాలు చదివితే, మా అత్తగారికి కోపం. ఎందుకు? 'రేపేమైనా పరీక్షా' ?! అంటారు. ఆ కిక్కు తనకి అర్ధం కాదు. ఈ వాగుడు కాయలకి వాగడం లో లభించే కిక్కు మనకి అర్ధం కాదు. మర్చిపోవడం ! దీనిమీదే సాధన చెయ్యాలి. నాకు ఏవైనా ఇలాంటివి జరిగితే, ఆ జ్ఞాపకాలతో, కుళ్ళిపోతూ బ్రతకడం అలవాటు. చీ ! క్షమించాలి తనని. దానికి కావల్సిన పరిపక్వత ఇలా డిస్కస్ చేస్తే వస్తుందేమో అని మా ఇంటి గోలని బ్లాగుకెక్కించా !
Hmm...ఇలాంటి కారక్టర్స్ ని నేను దగ్గర్నుంచి చూసాను. నాకు బాగా కావల్సిన దగ్గరి కుటుంబీకుల్లో ఇలాంటి కారక్టర్ బారిన పడి చాలానే నష్టపోతున్న ఒకరి విషయం తెలుసు.
హానెస్ట్ గా చెప్పాలీ అంటే, ఒక్కటే మార్గం. ఈ విషయం లో హజ్బండ్ సపోర్ట్ తీసుకొని, ఆ కారక్టర్ కి ద్వారం తెరచియే ఉన్నది అని, చూపెట్టటం. కాని ఈ విషయంలో ఆ సపోర్ట్ కొంచెం తక్కువైనా, తనకుండే ఆబ్లిగేషన్స్ వల్ల కొంచెం ఊగిసలాడినా, ఇక తప్పదు మీ క్రియేటివిటీకి పదును పెట్టటం, ఆ ప్రాసెస్ లో కొన్ని సాయంత్రాలని పాడుచేసుకోవటం.
" నేను రాత్రిళ్ళు (నిద్రపట్టక/ పొరపాట్న) పుస్తకాలు చదివితే, మా అత్తగారికి కోపం. ఎందుకు? 'రేపేమైనా పరీక్షా' ?! అంటారు. ఆ కిక్కు తనకి అర్ధం కాదు. ఈ వాగుడు కాయలకి వాగడం లో లభించే కిక్కు మనకి అర్ధం కాదు."
భలే చెప్పారు!!
మా చందు క్రికెట్ పిచ్చికి,నా పుస్తకాల
పిచ్చికీ మధ్యకూడా తరుచూ ఇలాటి క్లాష్ లే వస్తాయి.
పోస్ట్ సరదాగా ఉంది.కొన్ని వాక్యాల్లో మంచి మెరుపులున్నాయి.
ఆల్ ది బెస్ట్.
అసలు మంచి కోడళ్ళు ఎక్కడైనా ఉంటారంటే నాకాశ్చర్యం!
అందునా ఒక్కతే ఆడపడుచు ఉందంటే...... ఇంతే సంగతులు!
కోడళ్ళు పుస్తకాలు చదవడాలు, సంగీతాలు వినడాలు,ఇవన్నీ ప్రపంచ వింతలు!
తల బొప్పి కట్టి ఉందిక్కడ! :-))
బెస్ట్ మార్గం- ఇలాంటి ఓ మనిషికి నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఒకటుంది
వాళ్ళ ప్లాన్సేంటో ముందే పసిగట్టాలి- వాళ్ళు ఒకళ్ళ గురించి మొదలుపెట్టీపెట్టగానే టాపిక్ మార్చేసి వాళ్ళు చెప్పదలుచుకున్న దానితో మనకీ అక్కడున్నవాళ్ళకీ ఏరకమైన ఇంటరస్ట్ లేదు అనిపిచేలా చేయాలి. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటో పసిగట్టి వాళ్ళు అక్కడికి చేరకుండా అడుగడుగునా అడ్డుపడాలి.
పైకి All is well లాగా ఉండాలి. వాళ్ళకీ మనకీ అర్ధమయ్యే ఫ్రీక్వెన్సీలో All is not well లా ఉండాలి.
అప్పుడూ చూసుకోండి ఎంత కుళ్ళుతారో :)
కానీ దీనికో Adverse Effect ఉంది. కొన్నాళ్ళకి మీమీద కక్ష కడతారు. మీ మీద దుష్ప్రచారం మొదలౌతుంది, be prepared for it,
ఎందుకు? 'రేపేమైనా పరీక్షా' ?!
ఈ dial కి నవ్వాగ లేదు. అవును ము౦దు అడిగి చదువుకొ౦డి. :)
ఇక మీ కధ లో ఆవిడ్ని క్షమి౦చెయ్య౦డి. ఈ సారి వచ్చినపుడు ప్రేమ గా ఉ౦డ౦డి, అలా కొ౦చె౦ మీకు కన్సెషన్ ఇస్తారేమో
sujatha garu bavundi andi
అత్తగార్లకి చాలా వింతలు కనపడతాయి కోడలి దగ్గర లెండి. అదే పని కూతురు చేస్తే మురిపెం.
కుమార్ గారు అన్నట్లు హస్బెండ్ సపోర్ట్ ఉత్తమం కానీ ఈ మగ మహారాజుల మూడ్లని నమ్మలేము కదండీ :)))).
కాం గా ఉంటే బెటరేమో ఆవిడింటికి వెళ్ళి.
బాగుందండీ మీ కోతి కొమ్మచ్చి!!!
నొప్పించినా తానొవ్వక, నొప్పిస్తూ తిరుగవలయు బంధువులతో సుమతీ అని నేనూ ఎప్పుడో డిసైడ్ అయిపోయా... లేకపోతే బంధుకోతులు ముంచేస్తారమ్మోయ్..
కరతలామలకం - ఏదీ ఓ పది సార్లు చూసి రాయండి. ( ఊర్కినే అన్నా.. మీ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ చూసి కూడా మీతో పరాచికాలాడతానా!)
Post a Comment